Sakshi News home page

20 లక్షల ఉద్యోగాలను కోల్పోయాం 

Published Sat, Mar 24 2018 1:08 AM

These American companies could lose in a trade war with China - Sakshi

వాషింగ్టన్‌: చైనా ఉత్పత్తులపై ఏకపక్షంగా భారీ టారిఫ్‌లు విధించడాన్ని అమెరికా సమర్థించుకుంది. చైనాతో వాణిజ్యలోటు వల్ల అమెరికాలో 20 లక్షల ఉద్యోగాలను కోల్పోయినట్టు వైట్‌హౌస్‌ పేర్కొంది. ‘‘అమెరికా అనైతిక వాణిజ్య విధానాల వల్ల ఆ దేశంతో వాణిజ్య లోటు 370 బిలియన్‌ డాలర్లకు చేరింది. మార్కెట్‌ వక్రీకరణ విధానాల కారణంగా ఏర్పడే ప్రతి బిలియన్‌ డాలర్‌ వాణిజ్య లోటు వల్ల మా వద్ద 6,000 ఉద్యోగాలకు నష్టం వాటిల్లింది. సంప్రదాయ లెక్కల మేరకు వాణిజ్య లోటు ఫలితంగా 20 లక్షల అదనపు ఉద్యోగాలు చైనాలో సమకూరగా, మా దగ్గర అంతే మొత్తం తగ్గాయి. ఇది తీవ్రమైన సమస్య’’ అని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇక ఏ విధంగా స్పందించాలనేది చైనా ఇష్టమని వ్యాఖ్యానించారు. వాణిజ్య బంధం ద్వారా అమెరికా కంటే చైనాయే ఎక్కువగా లబ్ధి పొందిందన్నారు.  చైనా ఆర్థిక విధానాలపై అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు చాలా వరకు ఇవే ఆందోళన వ్యక్తం చేశాయని అధ్యక్ష కార్యాలయం అధికారి చెప్పారు. కాగా ట్రంప్‌ సర్కారు చర్యలను సెనేట్‌ ఫైనాన్స్‌ కమిటీ సభ్యుడు రాన్‌వైడన్, సెనేటర్‌ షెరాడ్‌బ్రోన్‌ స్వాగతించారు.

ఏకపక్ష చర్యలు వద్దు: అమెరికా కంపెనీలు
అయితే, ఏకపక్ష చర్యలు సమస్యకు పరిష్కారం కాదని అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈవోల సంఘం ‘బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌’ పేర్కొంది. చైనాలో సంస్కరణలు తెచ్చేలా దీర్ఘకాలిక వ్యూహం అమలు చేయకుండా ఏకపక్షంగా టారిఫ్‌ విధించడం లేదా ఇతర ఆంక్షలనేవి అమెరికాలో ధరల పెరుగుదలకు దారితీస్తాయని అభిప్రాయపడింది. దీనివల్ల అమెరికా కంపెనీలు, ఉత్పత్తులు పోటీ పడలేని పరిస్థితి ఏర్పడుతుందని, అమెరికా వినియోగదారులు, కార్మికులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

అమెరికా ఉత్పత్తులకూ చైనా అదేశిక్ష
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 3 బిలియన్‌ డాలర్ల సరుకులపై అధిక టారిఫ్‌లు విధించనున్నట్టు చైనా ప్రకటించింది. దీన్ని అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తులపై వేసిన టారిఫ్‌కు ప్రతిచర్యగా చైనా పేర్కొంది. వైన్, సీమ్‌లెస్‌ స్టీల్‌ ట్యూబులు, పంది మాంసం తదితర 128 ఉత్పత్తులపై పన్ను పెంపు ఉంటుందని చైనా వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. పండ్లు, వైన్, సీమ్‌లెస్‌ స్టీల్‌ ట్యూబులపై 15 శాతం పన్ను, పంది మాంసం, శుద్ధి చేసిన అల్యూమినియం ఉత్పత్తులపై 25 పన్ను విధించనున్నట్టు తెలిపింది. రెండు దశల్లో వీటిని అమలు చేస్తామని పేర్కొంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement