మార్కెట్ బేర్.. ఐపీఓ జోర్! | Sakshi
Sakshi News home page

మార్కెట్ బేర్.. ఐపీఓ జోర్!

Published Thu, Dec 3 2015 1:21 AM

మార్కెట్ బేర్.. ఐపీఓ జోర్!

పబ్లిక్ ఇష్యూలతో ప్రైమరీ మార్కెట్ కళకళ...
 లాభాల బాటలో కొత్తగా లిస్టయిన కంపెనీలు
 ఐపీఓ వరుసలో మరిన్ని సంస్థలు...

 
 ఈ ఏడాది సెకండరీ మార్కెట్ నష్టపోయినా, ప్రైమరీ మార్కెట్ లాభాల్ని సంపాదించింది. ఈ ఏడాది బీఎస్‌ఈ సెన్సెక్స్ తీవ్ర ఒడిదుడుకులకు లోనై 6 శాతం కోల్పోయినా, ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చిన కంపెనీల షేర్లు చాలా వరకూ కళకళలాడాయి. ఈ ఏడాది  ఇప్పటివరకూ 18 కంపెనీలు ఐపీఓకు రాగా వీటిల్లో దాదాపు సగానికి పైగా ఇష్యూ ధర కంటే ఎక్కువ ధరకే ట్రేడవుతున్నాయి. లిస్టింగ్‌లోనూ మెరుపులు మెరిపించిన ఈ కంపెనీలు ఆ తర్వాత కూడా లాభాల జోరును కొనసాగించాయి.
 
 అదే విధంగా ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చిన ఐపీఓలు కూడా ఉన్నాయి.
   వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్  కంపెనీ రూ.205 ఇష్యూ ధరతో ఐపీఓకు వచ్చింది. 43 శాతం లాభంతో రూ.288 ధర వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 30న బీఎస్‌ఈలో లిస్టయింది. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.430. ఐపీఓ ధరతో పోలిస్తే 110 శాతం పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకూ అధికంగా లాభపడ్డ ఐపీఓ షేర్ ఇదే. జీఎస్‌టీ బిల్లు అమల్లోకి వస్తే లాజిస్టిక్స్ కంపెనీలు లాభపడతాయన్న అంచనాలు, ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందగలదన్న అంచనాలు కూడా ఈ షేర్ జోరుకు ఒక కారణం. ఒక్క ఈ కంపెనీయే కాకుండా ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన చాలా కంపెనీలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచాయి.
 
 సెకండరీ మార్కెట్ జోరుగా ఉన్నప్పుడే ప్రైమరీ మార్కెట్ కూడా జోరుగా ఉంటుందనేది సాధారణ అంశం. కానీ ఈ ఏడాది సెకండరీ మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రైమరీ మార్కెట్ మంచి ఊపు మీద ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకూ 18 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వీటిల్లో 11 కంపెనీలు 10-110  శాతం లాభాలను ఇవ్వడం విశేషం. దాదాపు 9 కంపెనీలు 15 శాతానికి పైగా రాబడులనిచ్చాయి.  ఎస్ హెచ్ కేల్కర్ అండ్ కంపెనీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో), ప్రభాత్ డైరీ,  పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, నవ్‌కార్ కార్పొరేషన్, సింజిన్ ఇంటర్నేషనల్, మన్‌పసంద్ బేవరేజెస్, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్, వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్, ఐనాక్స్ విండ్, ఓర్టెల్ కమ్యూనికేషన్స్... ఈ కంపెనీల షేర్లు ఇష్యూ ధర కంటే అధిక ధర వద్దే ట్రేడవుతున్నాయి.
 
 రూ. 11,000 కోట్లు సమీకరణ...
  ఈ ఏడాది ఇప్పటివరకూ 18 కంపెనీలు ఐపీఓ ద్వారా  రూ.11,000 కోట్లు నిధులు సమీకరించాయి. గత నాలుగేళ్లలో ఐపీఓల ద్వారా ఈ స్థాయి రాబడులు రావడం ఇదే మొదటిసారి. ఇక గత ఏడాది మొత్తంలో 6 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. రూ.1,261 కోట్లు సమీకరించాయి. 2013లో మూడు కంపెనీలు రూ.1,284 కోట్లు సమీకరించాయి. ప్రైమరీ మార్కెట్ జోరుగా ఉండటంతో పలు కంపెనీలు నిధుల సమీకరణకు ఐపీఓ బాట పడుతున్నాయని నిపుణులంటున్నారు. వివిధ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఈ సానుకూల మార్కెట్ సెంటిమెంట్ నుంచి ప్రయోజనం పొందే వ్యూహంలో భాగంగా ఐపీఓ జారీచేసేందుకు అవి  ఇన్వెస్ట్ చేసిన కంపెనీలను కోరుతున్నాయి.
 
 ఒక్క రియల్టీ కంపెనీ లేదు.
 అయితే ఇప్పటివరకూ వచ్చిన ఐపీఓల్లో ఒక రియల్టీ కంపెనీ కూడా లేదు. పైగా 2005 నుంచి ఇప్పటివరకూ 30 కి పైగా రియల్టీ కంపెనీలు తమ ఆఫర్ డాక్యుమెంట్లను ఉపసంహరించుకున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉండడమే దీనికి కారణమని నిపుణులంటున్నారు. 2005-15 మధ్యకాలంలో ఐపీఓకు వచ్చిన 40 రియల్టీ కంపెనీల షేర్లలో 28 నష్టాల్లో ఉన్నాయి. డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఐఎల్ వంటి 20కు పైగా కంపెనీల షేర్ల ధరలు 80 శాతం వరకూ హరించుకుపోయాయి. 2012లో నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్‌బీసీసీ) తర్వాత ఒక్క రియల్టీ ఐపీఓ మార్కెట్‌కు రాలేదు.
 
 వచ్చే వారం రెండు ఐపీఓలు..
 వచ్చే వారం మరో రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఈ నెల 8న డాక్టర్ పాథ్‌ల్యాబ్స్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ ఐపీఓలు వస్తున్నాయి. రూ.540-550 ఇష్యూధరతో పాథ్‌ల్యాబ్స్ కంపెనీ రూ.360 కోట్లు సమీకరించనుంది. రూ.1,020-1,300 ఇష్యూధరతో ఆల్కెమ్ ల్యాబ్ కంపెనీ రూ.1,300 కోట్లు సమీకరించనుంది


 

Advertisement

తప్పక చదవండి

Advertisement