ఆర్‌టీజీఎస్‌ వేళలు మార్పు | Sakshi
Sakshi News home page

ఆర్‌టీజీఎస్‌ వేళలు మార్పు

Published Thu, Aug 22 2019 8:35 AM

Timings Changes in RTGS - Sakshi

ముంబై: భారీ పరిమాణంలో నగదు బదిలీకి ఉపయోగించే ఆర్‌టీజీఎస్‌ సిస్టమ్‌ వేళలను రిజర్వ్‌ బ్యాంక్‌ సవరించింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌) విధానంలో రూ. 2 లక్షల పైబడిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేయొచ్చు. దీని వేళలు ఇప్పుడు కస్టమర్ల లావాదేవీలకు సంబంధించి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా, ఇంటర్‌బ్యాంక్‌ లావాదేవీల కోసం రాత్రి 7.45 దాకా ఉం టున్నాయి. ప్రస్తుతం రూ. 2 లక్షల లోపు నిధుల బదిలీ కోసం నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) ఉపయోగిస్తున్నారు. దీని వేళలు ఉదయం 8 నుంచి రాత్రి 7 దాకా ఉంటున్నాయి.  

కార్డు చెల్లింపులకూ ఈ–మాండేట్‌...
వర్తకులు, వ్యాపార సంస్థలకు క్రెడిట్, డెబిట్‌ కార్డులు, వాలెట్స్‌ వంటివాటిద్వారా తరచూ చేసే చెల్లింపులకు కూడా ఈ–మాన్‌డేట్‌ విధానాన్ని వర్తింపచేసేందుకు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. దీనికి రూ. 2,000 దాకా లావాదేవీ పరిమితి ఉంటుంది. ప్రస్తుత విధానం ప్రకారం కార్డుల ద్వారా చిన్న మొత్తాలు చెల్లించినా కూడా ప్రత్యేకంగా వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ వంటివి ఉపయోగించాల్సి వస్తున్నందువల్ల లావాదేవీకి ఎక్కువ సమయం పడుతోంది. తాజా వెసులుబాటుతో చిన్న మొత్తాల చెల్లింపు సులభతరమవుతుంది. ఈ–మాన్‌డేట్‌కు నమోదు చేసుకున్నందుకు కార్డ్‌హోల్డరు నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయరాదని బ్యాంకులు/ఆర్థిక సంస్థలను ఆర్‌బీఐ ఆదేశించింది.

Advertisement
Advertisement