ఫలితాలు, గణాంకాలు కీలకం | Sakshi
Sakshi News home page

ఫలితాలు, గణాంకాలు కీలకం

Published Mon, May 1 2017 12:16 AM

ఫలితాలు, గణాంకాలు కీలకం - Sakshi

నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు
► ట్రేడింగ్‌ నాలుగు రోజులే
► ఈ వారంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు

న్యూఢిల్లీ: కంపెనీల గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు, తయారీ, సేవల రంగానికి సంబంధించిన ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు.

వీటితో పాటు అమెరికా–ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తత, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల సరళి.. తదితర అంశాలు స్టాక్‌ మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా నేడు(సోమవారం) సెలవు కారణంగా ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం.

గణాంకాలపై దృష్టి..
తయారీ రంగ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) గణాంకాలు మంగళవారం(ఈ నెల 2న), సేవల రంగ పీఎంఐ గణాంకాలు గురువారం(4న) వస్తాయి. 8 కీలక పరిశ్రమల ఏప్రిల్‌ నెల  పనితీరుకు సంబంధించిన గణాంకాలను మంగళవారం ప్రభుత్వం విడుదల చేయనున్నది. బుధవారం(ఈ నెల 3న) ఐసీఐసీఐ బ్యాంక్‌ తన ఆర్థిక  ఫలితాలను వెల్లడించనున్నది.

గురువారం (ఈ నెల 4న)  ఎంఆర్‌ఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ,  శనివారం(ఈ నెల6న) డి మార్ట్‌ రిటైల్‌ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ ఫలితాలు వస్తాయి. వీటితో పాటు ఆర్‌బీఎల్‌ బ్యాంక్, ఐనాక్స్‌ లీజర్, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్,  అజంతా ఫార్మా, డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఇమామి, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్, గోద్రేజ్‌ ప్రోపర్టీస్, ఎంసీఎక్స్, ఒబెరాయ్‌ రియల్టీ, టాటా కమ్యూనికేషన్స్‌ తదితర కంపెనీల ఫలితాలు కూడా వెలువడుతాయి.

వెలుగులో వాహన షేర్లు!
ఏప్రిల్‌ నెల వాహన విక్రయ వివరాలను వాహన కంపెనీలు వెల్లడిస్తాయి. ఈ వాహన విక్రయాల నేపథ్యంలో వాహన షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. ఇంధన ధరల సవరణ కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు– బీపీసీఎల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌లు వెలుగులోకి రావచ్చు.

మార్కెట్లో అప్రమత్తత
స్టాక్‌ సూచీలు శిఖర స్థాయిల్లో ఉన్న నేపథ్యంలో మార్కెట్‌లో అప్రమత్త వాతావరణం ఉండొచ్చని ట్రేడ్‌ స్మార్ట్‌ ఆన్‌లైన్‌ డైరెక్టర్‌ విజయ్‌ సింఘానియా అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు దిశా నిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.  అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లకు సంబంధించిన నిర్ణయాత్మక సమావేశం ఈ వారంలోనే జరగనున్నదని, ఈ వారంలో వెలువడే అమెరికా ఉద్యోగ గణాంకాలు వంటి అంతర్జాతీయ అంశాల ప్రభావం మార్కెట్‌పై ఉంటుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు.

విదేశీ పెట్టుబడుల జోరు..
గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఓ) మన క్యాపిటల్‌ మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వ డెట్‌ సాధనాల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల పరిమితిని సెబీ పెంచడం... అదేవిధంగా అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ ఏప్రిల్‌లో భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. డిపాజిటరీల గణాంకాల ప్రకారం గత నెలలో ఎఫ్‌పీఐలు మన స్టాక్‌ మార్కెట్లో రూ.2,394 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.20,364 కోట్లు... వెరశి మన క్యాపిటల్‌ మార్కెట్లో మొత్తం రూ.22,758 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టారు.

Advertisement
Advertisement