సెన్సెక్స్ 479 పాయింట్లు అప్ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ 479 పాయింట్లు అప్

Published Tue, May 5 2015 1:12 AM

సెన్సెక్స్ 479 పాయింట్లు అప్

అన్ని రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు
27,491కు సెన్సెక్స్ సూచీ...
150 పాయింట్ల లాభంతో 8,332కు నిఫ్టీ
మరికొన్నాళ్లు ఈ స్పీడ్: నిపుణులు

ముంబై: అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు పోటెత్తడంతో స్టాక్ మార్కెట్ సోమవారం భారీ లాభాల్లో ముగిసింది. ఏప్రిల్‌లో అమ్మకాలు జరిపిన ఇన్వెస్టర్లు మేలో తాజాగా పొజిషన్లు తీసుకోవడంతో స్టాక్ మార్కెట్ దూసుకుపోయింది. నిఫ్టీ 8,300 పాయింట్ల స్థాయి పైకి చేరింది. ఎఫ్‌ఐఐల మ్యాట్‌పై కొన్ని మినహాయింపులివ్వడం, ఆర్థిక బిల్లు ఆమోదం పొందడం, రిటైల్ రంగంలో రెండు భారీ విలీనాలు చోటు చేసుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపర్చింది. ఏప్రిల్‌లో వాహన విక్రయాలు అంచనాలను మించడంతో వాహన షేర్లు దూసుకుపోవడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది. వాహన, రియల్టీ, రిఫైనరీ రంగాలకు చెందిన స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు కనిపించింది.
 
ఇదే అవకాశం...: గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో అమ్మకాల కారణంగా పలు షేర్లు తక్కువ స్థాయిల్లో లభ్యమవుతుండటంతో కొనుగోళ్లు పెరిగాయని నిపుణులంటున్నారు. సెక్యూరిటీల విక్రయం, రాయల్టీ, టెక్నికల్ సర్వీసుల ఫీజులు, వడ్డీ ఆదాయం.. వీటన్నింటి మూలధన లాభాలపై మ్యాట్ వర్తించదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టత ఇవ్వడం  మార్కెట్ పెరుగుదలకు కారణమైందని ట్రేడర్లు పేర్కొన్నారు గత మూడు వారాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు దాదాపు 7 శాతం వరకూ నష్టపోయాయని, సోమవారం జరిగిన షార్ట్ కవరింగ్ కారణంగా ఈ సూచీలు దాదాపు 2 శాతం లాభపడ్డాయని నిపుణులంటున్నారు. ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ కొంత కాలం కొనసాగుతుందని వారంటున్నారు.

ఇదే జోరు రానున్న రోజుల్లో కూడా కొనసాగుతుందన్న అంచనాలున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. సెన్సెక్స్ 27,205 పాయింట్లతో లాభాల్లోనే ప్రారంభమైంది. కొనుగోళ్లు జోరుగా ఉండటంతో 27,538 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 479 పాయింట్ల లాభంతో 27,491 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 8,346 పాయింట్ల గరిష్ట స్థాయికి ఎగసింది. చివరకు 150 పాయింట్ల లాభంతో 8,332 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీకి రెండు నెలల్లో ఇదే అత్యుత్తమ గరిష్ట స్థాయి.
 
టాప్‌గేర్‌లో రిటైల్, వాహన షేర్లు

రిటైల్ రంగంలో భారీ పరిణామాలు సంభవించాయి. కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ భారతీ రిటైల్‌ను రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఫ్యూచర్ రిటైల్ 12 శాతం ఎగసి రూ.129 వద్ద ముగిసింది. రిటైల్ వ్యాపారాన్ని ఏకీకృతం చేయాలనుకున్న ఆదిత్య బిర్లా గ్రూప్ యోచనకు స్టాక్ మార్కెట్ సై అంది. దీంతో పాంటలూన్ ఫ్యాషన్ 20 శాతం అప్పర్ సీలింగ్‌తో రూ. 138 వద్ద ముగిసింది. ఆదిత్య బిర్లా నువో 12.6 శాతం లాభపడి రూ.1,764 వద్ద ముగిసింది. వాహన విక్రయాలు ఏప్రిల్ నెలలో అంచనాలను మించడంతో వాహన షేర్లు పరుగులు పెట్టాయి.  బజాజ్ ఆటో 7.4 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 4.7 శాతం,  టీవీఎస్ మోటార్  6 శాతం, హీరో మోటోకార్ప్ 2.4 శాతం చొప్పున పెరిగాయి.
 
30కి 27 షేర్లు లాభాల్లోనే
30 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ఓఎన్‌జీసీ 7.5 శాతం,  సిప్లా 5.8 శాతం,  భెల్ 3.2 శాతం, హిందాల్కో 3.2 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.2 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.9 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.8 శాతం, ఎస్‌బీఐ 2.6 శాతం, డాక్టర్ రెడ్డీస్ 2.6 శాతం, ఇన్ఫోసిస్ 2.6 శాతం, హీరో మోటోకార్ప్ 2.4 శాతం, చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.61 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.147 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

Advertisement
Advertisement