అంచనాలకు తగ్గట్లే విప్రో | Sakshi
Sakshi News home page

అంచనాలకు తగ్గట్లే విప్రో

Published Tue, Jan 19 2016 1:38 AM

అంచనాలకు తగ్గట్లే విప్రో

క్యూ3లో నికర లాభం రూ.2,234 కోట్లు; 2% వృద్ధి
ఆదాయం 12,310 కోట్లు. 9% అప్
రూ. 5 మధ్యంతర డివిడెండ్

 బెంగళూరు: చెన్నై వరదలు, సీజనల్ సెలవుల ప్రభావంతో దేశీయంగా మూడో అతి పెద్ద ఐటీ దిగ్గజం విప్రో .. అంచనాలకు అనుగుణమైన పనితీరే కనపర్చింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభ వృద్ధి రెండు శాతానికి పరిమితమై రూ. 2,234 కోట్లుగా నమోదైంది. ఐటీ సర్వీసుల ఆదాయం 9 శాతం పెరిగి రూ. 12,310 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 2,193 కోట్లు కాగా, ఆదాయం రూ. 12,085 కోట్లు. అంతర్జాతీయ ఇన్‌ఫ్రా సర్వీసులు తదితర విభాగాల్లో భారీ డీల్స్ దక్కించుకోగలిగామని విప్రో సీఈవో టీకే కురియన్ చెప్పారు.

   వినూత్న డిజిటల్ సామర్థ్యాలతో సమగ్రమైన టెక్నాలజీ సేవలు అందించడంపై తాము దృష్టి పెట్టనున్నట్లు కొత్త సీఈవోగా ఫిబ్రవరి 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్న ఆబిదాలీ నీముచ్‌వాలా తెలి పారు. రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండు చెల్లించే ప్రతిపాదనకు కంపెనీ ఆమోదముద్ర వేసింది. నాలుగో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల ఆదాయాలు స్వల్ప వృద్ధితో 1.87-1.91 బిలియన్ డాలర్ల మధ్య ఉండగలవని విప్రో పేర్కొంది.  

 చెన్నై వరదల దెబ్బ..
 మూడో త్రైమాసికంలో విప్రో ఐటీ సేవల విభాగం నిర్వహణ మార్జిన్లు 21.8 శాతం నుంచి 20.2 శాతానికి పడిపోయాయి. కంపెనీ సిబ్బందిలో దాదాపు 13 శాతం మంది ఉన్న చెన్నైలో వరదల వల్ల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడటం ఇందుకు కారణం. కాగా, క్యూ3లో కొత్తగా 39 క్లయింట్లను దక్కించుకోగలిగామని, ఏడు భారీ డిజిటల్ డీల్స్ కుదుర్చుకున్నామని కురియన్ చెప్పారు.
 

Advertisement
Advertisement