వాటా విక్రయిస్తున్న ట్రాన్‌సెల్ | Sakshi
Sakshi News home page

వాటా విక్రయిస్తున్న ట్రాన్‌సెల్

Published Tue, Jul 8 2014 1:05 AM

transcell biologics selling share

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టెమ్ సెల్ (మూల కణాల) బ్యాంకింగ్, ప్రాసెసింగ్ సేవల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ట్రాన్‌సెల్ బయాలాజిక్స్ నూతన విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ఇందుకు కావాల్సిన నిధుల సమీకరణకై వాటా విక్రయిస్తున్నట్టు కంపెనీ వర్గాల సమాచారం. తొలి విడతగా రూ.10 కోట్లు, మలివిడతగా రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేటు ఈక్విటీ సంస్థ ముందుకు వచ్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 12 నుంచి 15 శాతం మేర వాటా విక్రయించే అవకాశం ఉంది.

బొడ్డు తాడు, దంతాలు, కొవ్వు, ఎముక మజ్జ నుంచి మూల కణాలను సేకరించగలిగే ఏకైక కంపెనీ ప్రపంచంలో తమదేనని ట్రాన్‌సెల్ చెబుతోంది. మూల కణాలను నిక్షిప్తం చేసుకునేందుకు దాతలు పెరుగుతుండడంతో ఈ రంగంలో ఉన్న వ్యాపార అవకాశాలను గుర్తించిన ప్రైవేటే ఈక్విటీ సంస్థలు ట్రాన్‌సెల్‌తో భాగస్వామ్యానికి సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కంపెనీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

 క్లినికల్ ట్రయల్స్‌తోపాటు..
 ఇప్పటి వరకు మూల కణాల నిక్షిప్తం, ప్రాసెసింగ్ సేవలందించిన ట్రాన్‌సెల్ మూల కణ ఆధారిత చికిత్సా పరీక్షలు (క్లినికల్ ట్రయల్స్) చేపట్టేందుకు సమాయత్తమైంది. కొన్ని రకాల వ్యాధులను నయం చేసేందుకు, నివారణకు మూల కణ  చికిత్స (స్టెమ్ సెల్ థెరపీ) భారత్‌తో సహా వివిధ దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది. అలాగే మూల కణ ఆధారిత ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాల్లోకి సైతం కంపెనీ అడుగు పెడుతోంది. ఇంజెక్టబుల్ ఉత్పత్తులను అభివృద్ధి చేయాలన్నది సంస్థ లక్ష్యం. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రమే భారత్‌లో ఈ రెండు విభాగాల్లో ప్రవేశించింది. కాగా, ట్రాన్‌సెల్ ప్రమోటర్లు ఇప్పటి వరకు రూ.6 కోట్లు సొంత నిధులను వెచ్చించారు. మూల కణ  రంగ శాస్త్రవేత్త సుభద్ర ద్రావిడ ట్రాన్‌సెల్‌ను స్థాపించారు. యూఎస్, కెనడా దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది.

 సామర్థ్యం పెంపు..
 ప్రస్తుతం 4 వేల శాంపిళ్లను హైదరాబాద్ కేంద్రంలో ట్రాన్‌సెల్ భద్రపరిచింది. 6 వేల శాంపిళ్లను నిక్షిప్తం చేయగలిగే సామర్థ్యం ఉంది. మరో 10 వేల శాంపిళ్లు భద్రపరిచేలా సామర్థ్యాన్ని పెంచనుంది. దేశంలో ఎక్కడి నుంచైనా మూల కణాలను సేకరించి 24 గంటల్లో భద్రపరిచే వ్యవస్థ తమ వద్ద ఉందని కంపెనీ అంటోంది. శ్రీలంక, దుబాయి తదితర దేశాలకు సేవలను విస్తరించింది. దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల వద్ద ఒక లక్ష శాంపిళ్లు భద్రంగా ఉన్నాయి. ఏటా ఈ సంఖ్య 50 శాతం పెరుగుతోంది.

Advertisement
Advertisement