రేపటి నుంచి ట్రూజెట్ సేవలు | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ట్రూజెట్ సేవలు

Published Fri, Jul 10 2015 11:47 PM

రేపటి నుంచి ట్రూజెట్ సేవలు

ఉదయం 8 గం.కి తిరుపతి నుంచి రాజమండ్రికి తొలి విమానం
- హైదరాబాద్, చెన్నై నుంచి కూడా పుష్కరాలకు విమానాలు
- 26 నుంచి పూర్తిస్థాయి సర్వీసులు; ఆరంభ ఆఫర్ ధర రూ.1,499
- ఈ ఏడాది చివరికి 5 విమానాలు; ఐదేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి
- కంపెనీ డెరైక్టర్, హీరో రామ్‌చరణ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో విమానయాన సంస్థ ఆరంభమైంది. ‘ట్రూజెఃట్’ పేరిట ఆదివారం నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు ‘టర్బో మేఘ ఎయిర్‌వేస్’ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి పూర్తిస్థాయి సేవలు ప్రారంభించనున్న ఈ సంస్థ... గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఆదివారం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నైల నుంచి  రాజమండ్రికి ప్రత్యేక విమానాలు నడుపుతోంది.

దీనికోసం హైదరాబాద్-రాజమండ్రి మధ్య రూ.1499 ధరను ప్రారంభ ఆఫర్‌గా ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు తొలి విమానం తిరుపతిలో బయలుదేరుతుందని శుక్రవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో టర్బో మేఘ డెరైక్టరు, సినీ హీరో రామ్‌చరణ్ ప్రకటించారు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-అహ్మదాబాద్, హైదరాబాద్-రాజమండ్రి మధ్య కూడా సర్వీసులుంటాయని ఆయన తెలిపారు. ఏడాదిన్నర నుంచి ప్రయత్నాలు చేస్తుండగా అన్ని అనుమతులూ వచ్చేసరికి ఇంత సమయం పట్టిందని, తాను బ్రాండ్ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నానని చెప్పారాయన. ‘‘విమాన ప్రయాణాల్లో కావాల్సినవి సౌకర్యం, సమయానికి చేరటం, సేవలు, ఆతిథ్యం, మంచి ఫుడ్. అవన్నీ మేం ఏ విమానయాన సంస్థకూ తక్కువ కాకుండా అందిస్తాం’’ అని ఆయన వివరించారు.
 
వినూత్న సేవలు; డిస్కౌంట్లు
ఈ రంగంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా వృద్ధులు, విద్యార్థులు, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందినవారు, జర్నలిస్టులకు టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు రామ్‌చరణ్ తెలియజేశారు. దీంతోపాటు సమీప ప్రాంతాల నుంచి ప్రయాణికుల్ని ఉచితంగా ఎయిర్‌పోర్టుకు చేర్చే బాధ్యతను కూడా తీసుకుంటున్నామంటూ... ఉదాహరణకు నెల్లూరు, చిత్తూరుల నుంచి తిరుపతి విమానాశ్రయానికి... షిర్డీ నుంచి ఔరంగాబాద్ విమానాశ్రయానికి తామే తీసుకెళతామని సంస్థ ఎండీ ఉమేష్ వంకాయలపాటి తెలియజేశారు.
 
రెండు విమానాలతో మొదలు
సంస్థ ప్రస్తుతం రెండు విమానాలను కొనుగోలు చేసింది. ఈ రెండూ 72 సీటర్ల ఏటీఆర్-500 విమానాలే. ఈ ఏడాది చివరికి వీటి సంఖ్య ఐదుకు చేరుస్తామని, దీనికోసం రూ.120-150 కోట్ల మధ్య పెట్టుబడి అవసరమవుతుందని తాము అంచనా వేస్తున్నామని ఉమేష్ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో దీనిపై రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియజేశారు. శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరో పార్క్‌లో... విమాన పరికరాల కోసం నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాల్ (ఎంఆర్‌ఓ) యూనిట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ యూనిట్ అన్ని అనుమతులూ వస్తే ఈ ఏడాది చివరికల్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. ట్రూజెట్ ద్వారా ఈ ఏడాది చివరినాటికి 70-80% లోడ్ ఫ్యాక్టర్‌ను సాధిస్తామనే విశ్వాసం కూడా ఆయన వ్యక్తంచేశారు. సెప్టెంబర్ నాటికి మరో 7 ప్రాంతాలకు సేవలందిస్తామని, విశాఖ కూడా ఇందులో ఉండవచ్చని చెప్పారాయన. ప్రస్తుతం తమకు 200 మంది వరకూ సిబ్బంది ఉన్నట్లు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement