ఎన్నారై కార్పొరేట్‌ దిగ్గజాలకు ట్రంప్‌ విందు | Sakshi
Sakshi News home page

ఎన్నారై కార్పొరేట్‌ దిగ్గజాలకు ట్రంప్‌ విందు

Published Thu, Aug 9 2018 1:10 AM

Trump feast for NRI corporate makers - Sakshi

న్యూయార్క్‌:  పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి, మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగా వంటి ప్రవాస భారత కార్పొరేట్‌ అధిపతులతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విందునిచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. న్యూజెర్సీలోని ప్రైవేట్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో ఇచ్చిన ఈ విందుకు భర్త రాజ్‌ నూయితో కలిసి ఇంద్రా నూయి, భార్య రీతు బంగాతో కలిసి అజయ్‌ బంగా హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న 15 మంది దిగ్గజాల్లో ఫియట్‌ క్రిస్లర్‌ సీఈవో మైఖేల్‌ మాన్లీ, ఫెడ్‌ఎక్స్‌ ప్రెసిడెంట్‌ ఫ్రెడరిక్‌ స్మిత్‌ తదితరులున్నారు. ‘నా ప్రభుత్వ విధానాలతో అత్యధికంగా లబ్ధి పొందిన సంస్థల్లో మీవి కూడా ఉన్నాయి. అలాగే పలు కేసుల్లో మీ సహకారం ఎంతగానో ఉపయోగపడింది. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకు మీ సహాయ, సహకారాలు కావాలి. కొత్త వాణిజ్య ఒప్పందాలతో రాబోయే రోజుల్లో అమెరికా వృద్ధి రేటు అయిదు శాతం స్థాయికి చేరే అవకాశాలున్నాయి‘ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ’అత్యంత శక్తిమంతమైన’ మహిళల్లో ఒకరిగా ఇంద్రా నూయిని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.  

నూయికి ఇవాంకా ప్రశంసలు..: త్వరలో పెప్సీకో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఇంద్రా నూయిపై డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. పలు సామాజిక విషయాల్లో నూయి తనతో పాటు ఎందరికో స్ఫూర్తి దాత అని కితాబిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement