మొబైల్ బ్యాంకింగ్‌లోకి యునినార్.. | Sakshi
Sakshi News home page

మొబైల్ బ్యాంకింగ్‌లోకి యునినార్..

Published Tue, Feb 10 2015 3:06 AM

మొబైల్ బ్యాంకింగ్‌లోకి యునినార్..

ఆగస్టుకల్లా సేవలు ప్రారంభం
- 4జీ సర్వీసుల్లోకి వస్తున్నాం
- సాక్షితో యునినార్ సీఈవో వివేక్ సూద్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ యునినార్ మొబైల్ బ్యాంకింగ్ సేవల్లోకి అడుగు పెడుతోంది. యునినార్ ప్రమోటర్ అయిన టెలినార్ ఇటీవలే ఫైనాన్స్ కంపెనీ ఐడీఎఫ్‌సీతో కలిసి పేమెంట్స్ బ్యాంకింగ్ లెసైన్స్ కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ నుంచి అనుమతులు, కంపెనీ పరంగా సాంకేతిక ఏర్పాట్లు ముగియడానికి నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉందని యునినార్ సీఈవో వివేక్ సూద్ తెలిపారు. యునినార్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఆగస్టుకల్లా మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. టెలినార్ ఇతర దేశాల్లో అందిస్తున్న సేవలనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోసహా దేశంలో ఆరు సర్కిళ్లలో పరిచయం చేస్తామని వెల్లడించారు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ ఫోన్ నుంచే బిల్లులు చెల్లించొచ్చు. ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుక్కోవచ్చు. దేశంలో ఎక్కడి నుంచైనా మొబైల్ ఫోన్‌కుగానీ, బ్యాంకు ఖాతాకుగానీ నగదు బదిలీ చేయవచ్చు.
 
టెలినార్ అనుభవంతో: మొబైల్ బ్యాంకింగ్ రంగంలో టెలినార్‌కు అపార అనుభవం ఉందని వివేక్ సూద్ తెలిపారు. ‘సైబీరియాలో టెలినార్ ఒక బ్యాంకును నిర్వహిస్తోంది. హంగేరీలో మొబైల్ చెల్లింపులు, మలేసియా, థాయిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మొబైల్ బ్యాంకింగ్ సేవలందిస్తోంది. టెలినార్‌కు ఉన్న అనుభవం నేపథ్యంలో ఆర్‌బీఐ నుంచి లెసైన్స్ త్వరలోనే వస్తుందని విశ్వసిస్తున్నాం. ఈ సేవల కోసం భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. సబ్సే సస్తా పేరుతో తక్కువ ధరకే 2జీ సేవలను అందించడంతో సామాన్యులకు చేరువయ్యామన్నారు. కస్టమర్లలో అత్యధికులకు బ్యాంకు ఖాతాలు లేవని,  ఉపాధికోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వారందరూ మొబైల్ బ్యాంకింగ్‌తో ప్రయోజనం పొందుతారని తెలిపారు.
 
స్పెక్ట్రం వేలంలో: యునినార్‌కు ప్రస్తుతం ఉన్న స్పెక్ట్రం 4జీ సేవలు అందించేందుకు సరిపోదని, 4జీ  స్పెక్ట్రం వేలంలో పాల్గొంటామని సీఈవో చెప్పారు. ఆరు సర్కిళ్లలో ఈ సేవలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. విస్తరణకు ఈ ఏడాది రూ.500 కోట్ల దాకా వ్యయం చేస్తున్నట్టు తెలిపారు. యునినార్‌కు తెలుగు రాష్ల్రాల్లో 45 లక్షల మంది కస్టమర్లున్నారు. వీరిలో 29% మంది ఇంటర్నెట్ వాడుతున్నారని సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కన్నన్ తెలిపారు. ఆరు సర్కిళ్లలో 2014లో 5 వేల టవర్లు ఏర్పాటైతే, వీటిలో 624 టవర్లు ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌కు కేటాయించారని వివరించారు. కాగా, భారత్‌లో యునినార్‌కు 4.2 కోట్ల మంది యూజర్లున్నారు. 2015లో ఈ సంఖ్య 5 కోట్ల కు చేరుకుంటుందని కంపెనీ విశ్వసిస్తోంది. కంపెనీ ఇప్పటి వరకు రూ.18,000 కోట్లు ఖర్చు చేసింది.

Advertisement
Advertisement