ఉర్జిత్ పండుగ ధమాకా! | Sakshi
Sakshi News home page

ఉర్జిత్ పండుగ ధమాకా!

Published Wed, Oct 5 2016 12:57 AM

ఉర్జిత్ పండుగ ధమాకా!

గృహ, వాహన, కార్పొరేట్ రుణాలు ఇక చౌక...
రెపో రేటు కోతకు ఆర్‌బీఐ ‘ఎంపీసీ’ ఏకగ్రీవ ఆమోదం
పావు శాతం తగ్గి 6.25 శాతానికి డౌన్; ఆరేళ్ల కనిష్టస్థాయి ఇది...
రుణ రేట్ల తగ్గింపునకు బ్యాంకర్లు సై...  
ప్రభుత్వం, పరిశ్రమ వర్గాల హర్షం

న్యూఢిల్లీ: విశ్లేషకులు, మార్కెట్ల అంచనాలకు భిన్నంగా గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి దిగింది. ఇది ఆరేళ్ల  కనిష్ట స్థాయి. దీనితో దసరా, దీపావళి ముందస్తు బహుమతిని ఆర్‌బీఐ ఇచ్చినట్లయ్యిందని ప్రభుత్వ, పరిశ్రమ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాజా నిర్ణయంతో గృహ, ఆటో, కార్పొరేట్ రుణాలు చౌకయ్యే అవకాశం ఉంది. 

కేవలం ఆర్‌బీఐ గవర్నర్ కాకుండా, ఆరుగురు సభ్యుల విస్తృత స్థాయి కమిటీ రెపోపై నిర్ణయం తీసుకోవడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రభుత్వం తరపు నుంచి ముగ్గురు సభ్యులు ఉండగా, ఆర్‌బీఐ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారు. రేటుపై నిర్ణయంలో కమిటీ సమానంగా చీలిపోతే- ఆర్‌బీఐ గవర్నర్ అదనపు ఓటు కీలకం అవుతుంది. తాజా నాల్గవ ద్వైమాసిక సమీక్షలో నిర్ణయం ఏకగ్రీవం కావడంతో ‘అదనపు’ ఓటు అవసరం ఏదీ లేకుండా పోయింది.

మరోవైపు బ్యాంకులు తమ అదనపు నిధుల డిపాజిట్‌పై ఆర్‌బీఐ ఇచ్చే రుణ రేటు సైతం 5.75 శాతానికి తగ్గింది. ఇదీ ఆరేళ్ల కనిష్ట స్థాయి. సెప్టెంబర్ 4న గవర్నర్‌గా రాజన్ పదవీ విరమణ తరువాత డిప్యూటీ గవర్నర్ నుంచి పదోన్నతి పొందిన ఉర్జిత్ పటేల్‌కు గవర్నర్‌గా ఇది మొట్టమొదటి పాలసీ సమీక్ష కావడం మరో విశేషం. రేటు కోత ఆరు నెలల్లో ఇది తొలిసారి. 2010 నవంబర్‌లో రెపో రేటు 6.25 శాతంగా ఉండేది. అక్టోబర్ 2011నాటికి 8.5%కి ఎగసింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒకపక్క చెబుతూనే మరోపక్క రేటుకోతకు ఆర్‌బీఐ మొగ్గుచూపడం గమనార్హం.  ద్రవ్యోల్బణంపై కఠిన వైఖరిని అవలంబించే వ్యక్తిగా ఉర్జిత్ పటేల్‌కు పేరుంది.

 ముఖ్యాంశాలు...
రెపో, రివర్స్‌రెపో రేటు వరుసగా 6.25 శాతం, 5.75 శాతానికి తగ్గాయి.

బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్‌బీఐ ఉంచాల్సిన మొత్తానికి సంబంధించి నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంగా కొనసాగుతుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.6 శాతం. వచ్చే ఏడాది 7.9 శాతానికి పెరిగే అవకాశం.

తగిన వర్షపాతం వృద్ధి ఊపునకు దోహదపడుతుంది.

ద్రవ్యోల్బణం మార్చి 17 నాటికి 5 శాతంగా ఉంటుంది. పెరిగేందుకే అవకాశాలు ఉన్నాయి. 2017 జనవరి - మార్చి మధ్య ద్రవ్యోల్బణం రేటు 5.3 శాతంగా ఉంటుందన్నది ఆర్‌బీఐ పరిశోధనా విభాగం అంచనా. వేతన సంఘం సిఫారసుల అమలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే వీలుంది. వచ్చే ఐదేళ్లూ ప్లస్ 2 లేదా మైనస్ 2 పరిమితితో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండేలా చర్యలు ఉండాలని ప్రభుత్వం ఆర్‌బీఐకి నిర్దేశిస్తోంది.

అమెరికా ఎన్నికల నేపథ్యంలో క్రూడ్ ధరలు, గ్లోబల్ డిమాండ్ వంటివి అనిశ్చితిలోనే కొనసాగుతాయి.

సెప్టెంబర్ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయి 372 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ వాణిజ్య రుణాల ద్వారా 3 మిలియన్ డాలర్ల వరకూ సమీకరించుకోడానికి స్టార్టప్స్‌కు అనుమతి. రూపాయిలు లేదా విదేశీ కరెన్సీల్లో వీటిని సమకూర్చుకోవచ్చు.

బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ సేవల విస్తరణ.

రుణ గ్రహీతలకు ప్రయోజనం: ఆర్‌బీఐ గవర్నర్
ప్రభుత్వం ద్రవ్యోల్బణం కట్టడికి తీసుకునే చర్యలు రేటు కోతకు అవకాశం కల్పిస్తాయని మూడవ ద్వైమాసిక సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ చేసిన సూచనను ఈ సందర్భంగా విధాన ప్రకటన సందర్భంగా పటేల్ ప్రస్తావించారు. ఇలాంటి చర్యలే ప్రస్తుతం రేటు కోతకు సహకరించాయని వివరించారు. ఆర్‌బీఐ రేటు తగ్గింపు, ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు రేట్ల కొరత వెరసి- బ్యాంకింగ్ కస్టమర్‌కు రేటు తగ్గింపు ప్రయోజనాన్ని అందించడానికి దోహదపడతాయని పటేల్ వివరించారు. ద్రవ్యలభ్యతకు సైతం ఆర్‌బీఐ పలు మార్కెట్ చర్యలు తీసుకుంటోందని అన్నారు.

తగిన వర్షపాతంతో వ్యవసాయ వృద్ధి, గ్రామీణ డిమాండ్ పెంపు, అలాగే వేతన కమిషన్ సిఫారసు నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో పెరిగే వినియోగం స్థూల దేశీయోత్పత్తికి దోహదపడతాయని పటేల్ అభిప్రాయపడ్డారు.  పరపతి విధానం, తగిన లిక్విడిటీ పరిస్థితులు ఉత్పాదక రంగాల్లో రుణ పునరుద్ధరణకు దోహదపడతాయని విశ్లేషించారు. కాగా బ్యాంకింగ్ మొండిబకాయిలు సమస్యేనన్న ఆయన, అయితే ఈ సమస్య పరిష్కారంలో నైపుణ్యం అవసరమని పేర్కొన్నారు. వృద్ధికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.  అంతర్జాతీయ అంశాలు భారత్ వాణిజ్యంపై ప్రభావాన్ని కొనసాగిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వృద్ధి మరింత కింద చూపు చూసే అవకాశాలే ఉన్నాయని అన్నారు.

8 శాతం వృద్ధికి దోహదం: కేంద్రం
తాజా నిర్ణయం పట్ల ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ), జీడీపీ 8 శాతం వృద్ధికి దోహదపడే నిర్ణయంగా అభివర్ణించింది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ప్రత్యేకించి పప్పుల ధరలు ప్రభుత్వం తగిన చర్యలు అన్నీ తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడుతుందని వివరించింది.  ద్రవ్యోల్బణం లక్ష్యాల గురించి ప్రభుత్వం - ఆర్‌బీఐ కలిసి పనిచేస్తున్నాయని ఫైనాన్స్ సెక్రటరీ అశోక్ లవాసా పేర్కొన్నారు.  ఆర్థికంగా సమాజంలోని అన్ని వర్గాలకూ దోహదపడే నిర్ణయమని అన్నారు. బ్యాంకులు రేటు తగ్గిస్తాయా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, ‘ఇది బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ సెంటిమెంట్‌కు అనుగుణంగా బ్యాంకులు నడుచుకుంటాయి’ అని అన్నారు.

సానుకూల నిర్ణయం: పరిశ్రమలు
తాజా ఆర్‌బీఐ రేటు కోతను పరిశ్రమ ‘దీపావళి ముందస్తు బహుమతి’గా అభివర్ణించింది. బ్యాంకులు ఈ నిర్ణయాన్ని వినియోగదారులకు బదలాయిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ప్రస్తుత పండుగల  సీజన్‌లో ఇది వినియోగ సెంటిమెంట్‌కు దోహదపడే అంశంగా  వివరించాయి. కొన్ని విభాగాల అభిప్రాయాన్ని చూస్తే...

వినియోగం...
బిజినెస్ సెంటిమెంట్‌ను గణనీయంగా పెంచడానికి దోహదపడే చర్య ఇదని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయెన్సెస్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ మనీష్ శర్మ అన్నారు. ఇది పెట్టుబడుల స్నేహపూర్వక వాతావరణానికి దోహదపడుతుందని వివరించారు.

తగిన సమయంలో రేటు కోత తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థకు ఊతం ఇస్తుందని, ఇది తమ ఉత్పత్తుల గ్రామీణ డిమాండ్‌ను బలపరచడానికి దోహదపడుతుందని ప్యానాసోనిక్ ఇండియా హెచ్ (సేల్స్‌అండ్‌సర్వీస్) అజయ్ సేథ్ అన్నారు.

ఆర్‌బీఐ నిర్ణయం వినియోగ ఉత్పత్తుల పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని హేయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బరాంజా అన్నారు.

వినియోగ ఉత్పత్తుల పరిశ్రమ పండుగల సీజన్‌లో 15 నుంచి 20 శాతం వృద్ధికి తాజా నిర్ణయం సహాయపడుతుందని భావిస్తున్నట్లు లాయిడ్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ డెరైక్టర్ నిపున్ సిఘాల్ అన్నారు.

పావుశాతం రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయిస్తాయన్న విశ్వాసాన్ని ఇంటెక్స్ టెక్నాలజీస్ సీఎఫ్‌ఓ రాజీవ్ జైన్ వ్యక్తం చేశారు.

 ఆటోమొబైల్...
పరిశ్రమకు మొత్తానికి ఇది హర్షదాయకమైన అంశమని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్‌సీ భార్గవ అన్నారు. ఆర్‌బీఐ ఇచ్చిన దీపావళి బహుమతిగా హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించడంపై దృష్టి అవసరమని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాలను హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ వ్యక్తం చేస్తూ, ఇది సెంటిమెంట్ బలపడేందుకు దోహదపడే అంశంగా వివరించారు.

రియల్ ఎస్టేట్...
రేటు ప్రయోజనాన్ని బ్యాంకర్లు కస్టమర్లకు బదలాయించాలని తాము కోరుకుంటున్నట్లు క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ పేర్కొన్నారు. ఇందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.  తాజా రేటు కోత, తదుపరి వృద్ధి అవకాశాలతో హౌసింగ్ తదితర రియల్టీ విభాగం వృద్ధి ఊపందుకుంటుందని ఎన్‌ఏఆర్‌ఈడీసీఓ చైర్మన్ తల్వాన్ అన్నారు. రెండుమూడేళ్లుగా బలహీనతలో కొనసాగుతున్న రియల్టీ రంగం సెంటిమెంట్‌కు ఈ నిర్ణయం ఉత్తేజం ఇస్తుందని ఎన్‌ఏఆర్‌ఈడీసీఓ ప్రెసిడెంట్ ప్రవీణ్ జైన్ అన్నారు.

తక్షణమే రేట్లు తగ్గిస్తాం: బ్యాంకర్లు
రిజర్వు బ్యాంక్ రెపో రేటు తాజా తగ్గింపు ప్రయోజనాన్ని తక్షణం రుణగ్రహీతలకు అందిస్తామని బ్యాంకర్లు చెప్పారు. 2015 జనవరి 15 నుంచి 2016 ఏప్రిల్ 5 మధ్య ఆర్‌బీఐ  1.50 శాతం రేటు తగ్గిస్తే... ఇందులో సగం కూడా (సగటున 60 బేసిస్ పాయింట్లు) బ్యాంకులు కస్టమర్‌కు బదలాయించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజా రేటు కోతపై ఆయా బ్యాంకుల చీఫ్‌లు ఇలా స్పందించారు....

ఐబీఏ: ఆర్థిక సంవత్సరం కీలక సమయంలో రెపోరేటు కోత హర్షణీయమని దేనా బ్యాంక్ సీఎండీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్  అశ్విన్ కుమార్ అన్నారు. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) విధానం ఇప్పటికే స్థిరపడినందున తాజా రేటు కోత ప్రయోజనాన్ని వేగంగా కస్టమర్లకు అందిస్తామని చెప్పారు.

ఎస్‌బీఐ: తగిన లిక్విడిటీ పరిస్థితుల్లో రేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకులు మొగుచూపుతాయని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. పాలసీ విధానం ఊహించినట్లే ఉందని ఎస్‌బీఐ మేనేజింగ్ డెరైక్టర్ పీకే గుప్తా పేర్కొన్నారు. బ్యాంక్ ఇప్పటికే తగిన రేటు కోత నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇందుకు అనుగుణంగా డిపాజిట్ రేట్లూ ఇటీవలే తగ్గాయన్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ ఆరంభం...
ఆర్‌బీఐ రేటు కోత ప్రయోజనంలో కొంత ఐసీఐసీఐ బ్యాంక్ వెనువెంటనే వినియోగదారుకు బదలాయించింది.  మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) ఆధారిత వార్షిక రుణ రేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.05 శాతానికి దిగింది. అక్టోబర్ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా నెలవారీ రుణ రేటును సైతం 8.90% నుంచి 8.85 శాతానికి తగ్గించింది.

పెట్టుబడులకు అలాగే వినియోగానికి రేటు కోత ఉత్సాహాన్ని ఇస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ చందా కొచర్ అన్నారు. ఇది లిక్విడిటీకి ఎంతో సానుకూల అంశంగా పేర్కొన్నారు. సరఫరాలవైపు ప్రభుత్వ దృష్టి ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశమన్నారు. త్వరలోనే ఆర్‌బీఐ రేటు నిర్ణయ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిస్తామని వివరించారు.

యస్‌బ్యాంక్: వచ్చే నెలల్లో 75 బేసిస్ పాయింట్ల వరకూ రేటు కోత ఉండొచ్చని యస్‌బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ తెలిపారు.

 

Advertisement
Advertisement