సంస్కరణలతో వాణిజ్య బంధానికి బూస్ట్ | Sakshi
Sakshi News home page

సంస్కరణలతో వాణిజ్య బంధానికి బూస్ట్

Published Mon, Aug 29 2016 1:16 AM

సంస్కరణలతో వాణిజ్య బంధానికి బూస్ట్

* అమెరికా వాణిజ్య మంత్రి ప్రిట్జ్‌కెర్   
* నేటి నుంచి భారత్‌లో పర్యటన

వాషింగ్టన్: భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో అమెరికా సానుకూలతతో ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం 109 బిలియన్ డాలర్లకు చేరుకుందని, జీఎస్‌టీ వంటి నూతన సంస్కరణలతో ఇది మరింత విస్తృతం అవుతుందని అమెరికా ఆదివారం ప్రకటించింది. అమెరికా వాణి జ్య మంత్రి పెన్నీ ప్రిట్జ్‌కెర్ 3 రోజుల భారత పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పర్యాటకం, ప్రాం తీయ ఒప్పందాలు అనేవి 2017లో రెండు దేశాల మధ్య వాణిజ్య సహకార విస్తృతికి దృష్టి సారించాల్సిన అంశాలుగా గుర్తించినట్టు ఆమె తెలిపారు.
 
పదేళ్లలో మూడు రెట్ల వృద్ధి
‘అమెరికా - భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 2005లో 37 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2015లో 109 బిలియన్ డాలర్లకు చేరుకుంది.  2015లో భారత్‌లో అమెరికా కంపెనీలు 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడితే... అమెరికాలో భారత కంపెనీలు 11 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. అమెరికాలోని భారత అనుబంధ కంపెనీలు 52వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి’ అని ప్రిట్జ్‌కెర్ గణాంకాలను వెల్లడించారు. ఇరుదేశాలు పరస్పరం కలసి సాధిం చేందుకు అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.
 
భారత్ చర్యల్ని స్వాగతిస్తున్నాం...
వ్యాపార వాతావరణాన్ని మెరుగు పరిచే విషయంలో భారత్ చర్యలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ, దివాళా చట్టాల ఆమోదం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సరళతరం చేయడం వంటి మోదీ సర్కారు ప్రతిష్టాత్మక సంస్కరణల ఎజెండా కారణంగా... రానున్న కాలంలో ఆర్థిక సహాకారం మరింత బలోపేతం అవుతుందని ప్రిట్జ్‌కెర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్‌టీ ఆమోదం అనేది చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు.
 
500 బిలియన్ డాలర్ల లక్ష్యం
ముంబై: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమీప భవిష్యత్తులో 500 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకుంది. ప్రస్తుతం ఇది 109 బిలియన్ డాలర్లుగానే ఉంది. పీడబ్ల్యూసీ, అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) సంయుక్త నివేదిక ప్రకారం... ఎయిరోస్పేస్, రక్షణ, బ్యాకింగ్, ఆర్థిక సేవలు, బీమా, రసాయనాలు, సరుకు రవాణా, ఇంధన, మౌలిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని, దేశీయంగా వృద్ధి చెందడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగానూ వ్యాపార కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే, పోర్టులు, ఆయిల్, గ్యాస్, ఫార్మా రంగాల్లోనూ అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement