డాలర్‌ వీక్‌... ఎగసిన పసిడి | Sakshi
Sakshi News home page

డాలర్‌ వీక్‌... ఎగసిన పసిడి

Published Sun, Mar 19 2017 11:57 PM

డాలర్‌ వీక్‌... ఎగసిన పసిడి - Sakshi

వారంలో అంతర్జాతీయంగా 25 డాలర్లు అప్‌  
ఫెడ్‌ రేట్‌ పెంపుతో అనూహ్యంగా పతనమైన డాలర్‌


న్యూఢిల్లీ/న్యూయార్క్‌: అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌ నైమెక్స్‌లో వరుసగా రెండు వారాల్లో 53 డాలర్లు తగ్గిన బంగారం ఔన్స్‌ (31.1 గ్రా) ధర, మార్చి 17వ తేదీతో ముగిసిన వారంలో భారీగా 25 డాలర్లు పెరిగింది. నిజానికి అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ గనక ఫండ్‌ రేటు పెంచితే డాలర్‌ బలపడుతుందని, ఇది పసిడి ధర తగ్గడానికి దారితీస్తుందని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఈ నెల 15న అమెరికా ఫెడ్‌– ఫండ్‌ రేటును 0.25 శాతం పెంచటంతో నిమిషాల్లో డాలర్‌ ఇండెక్స్‌ 101 స్థాయికి పడిపోయింది.

దీంతో ఒక్కసారిగా బంగారానికి బలమొచ్చింది. అప్పటి వరకూ 1,200 డాలర్లకు ఐదు డాలర్లు అటుఇటుగా తిరిగిన పసిడి, భారీ జంప్‌తో రెండు రోజుల్లో 1,229 డాలర్ల స్థాయికి చేరింది. డాలర్‌ బలహీనత కొనసాగితే, పసిడి మరింత ముందుకు కదలడం ఖాయమని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలిచి వస్తే, ఆయన అనుసరించే ‘డాలర్‌ బలహీనత’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా పసిడికి 1,200 డాలర్ల వద్ద మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు చెబుతున్నారు.

దేశీయంగా పెరిగినా... రూపాయి బలోపేతంతో బ్రేక్‌
అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో బంగారం ధర 10 గ్రాములకు 17వ తేదీతో ముగిసిన వారంలో రూ.143 పెరిగి రూ.28,509కి చేరింది. అంతక్రితం రెండు వారాల్లో పసిడి రూ.1,277 తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.90 పెరిగి రూ.28,640కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.28,490కి ఎగసింది.

వెండి కేజీ ధర రూ. 260 పెరిగి రూ.41,325కు పెరిగింది. రూపాయి భారీగా బలపడ్డం (డాలర్‌ మారకంలో రూ.65.50 దిగువకు)దేశీయంగా పసిడి పరుగుకు (అంతర్జాతీయ ధర స్పీడ్‌తో పోల్చితే) బ్రేక్‌ పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా అంతక్రితం రెండు వారాల్లో (మార్చి 3, 10 తేదీలతో ముగిసిన వారాలు) స్పాట్‌ మార్కెట్‌లో పసిడి 10 గ్రాములకు దాదాపు రూ.1,000 తగ్గగా, వెండి దాదాపు రూ.2,000కుపైగా నష్టపోయింది.

Advertisement
Advertisement