ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య

Published Thu, Dec 29 2016 1:39 AM

ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య

మూడేళ్ల పాటు పదవీ కాలం
ప్రస్తుతం న్యూయార్క్‌ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌


న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, న్యూయార్క్‌ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌ విరాళ్‌ ఆచార్య తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆచార్య (42) మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. క్యాబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆయన నియామకానికి  ఆమోదముద్ర వేసింది. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ పదోన్నతి పొందినప్పట్నుంచీ డిప్యూటీ గవర్నర్‌ స్థానం ఒకటి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు (ఎస్‌ఎస్‌ ముంద్రా, ఎన్‌ఎస్‌ విశ్వనాథన్, ఆర్‌ గాంధీలు) ఉన్నారు. డీమోనిటైజేషన్‌ దరిమిలా రిజర్వ్‌ బ్యాంక్‌ పూటకో నిబంధన మార్చేస్తూ, తీవ్ర విమర్శల పాలవుతున్న తరుణంలో ఆచార్య నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌ యూనివర్సిటీ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఎన్‌వైయూ–స్టెర్న్‌)లోని ఆర్థిక విభాగంలో సీవీ స్టార్‌ ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు.ముంబై ఐఐటీ విద్యార్థి అయిన ఆచార్య.. 1995లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ చదివారు. 2001లో ఎన్‌వైయూ–స్టెర్న్‌ నుంచి ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 2001–08 మధ్య కాలంలో లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. భారతీయ క్యాపిటల్‌ మార్కెట్స్‌పై ఎన్‌ఎస్‌ఈ–ఎన్‌వైయూ స్టెర్న్‌ చేపట్టిన అధ్యయనానికి డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు.

‘పేదల రఘురామ్‌ రాజన్‌’...
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తనకు స్ఫూర్తిప్రదాతగా చెబుతుంటారు ఆచార్య. అంతే కాదు.. తనను తాను పేదల రఘురామ్‌ రాజన్‌గా అభివర్ణించుకుంటారు. 2013లో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా దీని వెనుక గల కథను ఆయన వివరించారు. తానొకసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు బ్యాంకింగ్, సంక్షోభాలు మొదలైన వాటికి సంబంధించి తన చేతిలో ఉన్న పత్రాలను చూసి తోటి ప్రయాణికుడు తనను రఘురామ్‌ రాజన్‌గా భావించారని ఆచార్య పేర్కొన్నారు. ’దీంతో రాజన్‌ను రోల్‌ మోడల్‌గా తీసుకుని, ఆయన సాధించిన దానిలో కనీసం 5–10 శాతం సాధించగలిగినా.. విమాన ప్రయాణాల్లో ’పేదల రఘురామ్‌ రాజన్‌’గా చలామణి అయిపోవచ్చని ఆరోజు గ్రహించాను’ అని ఆచార్య చమత్కరించారు.

తన రోల్‌ మోడల్‌ రాజన్‌తో కలిసి ఆయన గతంలో మూడు పరిశోధన పత్రాలు రాశారు. ’సార్వభౌమ రుణం, ప్రభుత్వ హ్రస్వదృష్టి, ఆర్థిక రంగం’, ’కంపెనీల అంతర్గత గవర్నెన్స్‌’, ’క్రియాశీలక పరిస్థితుల్లో రుణభారం, ప్రభుత్వ హ్రస్వదృష్టి’ పేరిట ఆయన ఈ పరిశోధన పత్రాలు రూపొందించారు.  రాజన్‌ తరహాలోనే కేంద్రీయ బ్యాంకుల స్వతంత్రత కాపాడాలన్నది ఆచార్య అభిప్రాయం. కేంద్రీయ బ్యాంకులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూనే, రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని అంటారాయన. న్యూయార్క్‌ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోని ఆచార్య ప్రొఫైల్‌ ప్రకారం.. ఆర్థిక రంగానికి వ్యవస్థాగతంగా ఎదురయ్యే రిస్కులు, నియంత్రణ, ప్రభుత్వ జోక్యంతో తలెత్తే సమస్యలు మొదలైన అంశాలపై ఆచార్య పరిశోధనలు చేశారు.

ప్రభుత్వ బ్యాంకులకు ‘ఆచార్య’ ఔషధం?
ఆచార్యకు భారత బ్యాంకింగ్‌ వ్యవస్థపై అపార అవగాహన ఉంది. బ్యాంకింగ్‌ ప్రమాణాలకు సంబంధించిన బాసెల్‌ 3 నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయని వాదించే వర్గాలకు ఆచార్య నియామకం రుచించకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.  దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థ బాగుపడాలంటే ముందుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను సరిదిద్దాలని, బాసెల్‌ నిబంధనలు మరింత కఠినతరంగా ఉండాలని ఆచార్య ఒక పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.  ’ప్రైవేట్‌ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులతోనే భారత బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఎక్కువగా రిస్కులు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాసెల్‌ 3 నిబంధనలకు అనుగుణంగా వచ్చే అయిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు తప్పనిసరిగా గణనీయంగా మూలధనం సమకూర్చుకోవాలి లేదా తమ మూలధనానికి తగ్గట్లుగా అసెట్స్‌ అయినా తగ్గించుకోవాలి’ అని ఆయన వివరించారు. 2015లో రాజన్‌ నిర్వహించిన అసెట్‌ క్వాలిటీ సమీక్ష అనేది నిజానికి ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆచార్య వ్యాఖ్యానించారు.

ఆర్‌బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదా మెరుగైన ప్రైవేట్‌ బ్యాంకుల్లో విలీనం చేయడం, ఆటోమేటిక్‌గా మూలధనం సమకూర్చడం, డిపాజిట్‌ బీమా పథకం ప్రవేశపెట్టి బ్యాంకుల రిస్కులను మదింపు చేయడం మొదలైన చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచించారు. బాసెల్‌ వంటి నిబంధనలు ఒక్కో బ్యాంకు పాటించాల్సిన నిబంధనలే సూచిస్తున్నాయే తప్ప పూర్తి వ్యవస్థను పటిష్టం చేసేవిగా లేవన్నది ఆచార్య అభిప్రాయం. ఫలితంగా ఒక్కో బ్యాంకు దేనికదే రిస్కులను పరిమితం చేసుకునే చర్యలు తీసుకున్నా .. పెను సంక్షోభాలేవైనా వచ్చినప్పుడు మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థకు రిస్కులు తప్పకపోవచ్చని ఆయన అంటారు. రిజర్వుబ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌గా ఆయన నియామకంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణల పర్వం మొదలవుతుందన్న అంచనాలు విశ్లేషకుల్లో ఉన్నాయి.

Advertisement
Advertisement