హరియాణాలో విశాక మరో ప్లాంటు | Sakshi
Sakshi News home page

హరియాణాలో విశాక మరో ప్లాంటు

Published Wed, Aug 22 2018 12:25 AM

Visaka Industries plant in Haryana - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విశాక ఇండస్ట్రీస్‌ హరియాణాలో మరో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. జజ్జర్‌ వద్ద రానున్న ఈ ప్లాంటులో డ్రై వాల్‌ ప్యానెళ్లను తయారు చేస్తారు. రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో 6–8 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని విశాక ఇండస్ట్రీస్‌ జేఎండీ జి.వంశీ కృష్ణ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరోకు చెప్పారు. రోజుకు 1,000 ప్యానెళ్లను తయారు చేసే సామర్థ్యంతో యూనిట్‌ను నిర్మిస్తామని, దీనికి అన్ని అనుమతులూ వచ్చాయని తెలియజేశారు.

ఆగస్టులో ఆటమ్‌ తయారీ..
ఆటమ్‌ పేరుతో సోలార్‌ రూఫ్‌టాప్స్‌ తయారీకి మిర్యాలగూడ వద్ద కంపెనీ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ నెల్లోనే ఉత్పత్తి ప్రారంభమవుతోంది. ఈ ప్లాంటు సామర్థ్యం 60 మెగావాట్లు. రూఫ్‌టాప్‌ రంగంలో దేశంలో అనుకున్న స్థాయిలో విస్తరణ జరగలేదని వంశీకృష్ణ అభిప్రాయపడ్డారు. వినూత్న డిజైన్‌తో చేసిన ఆటమ్‌... మార్కెట్లో మంచి డిమాండ్‌ను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోలార్‌ ప్యానెళ్లే రూఫ్‌టాప్‌గా వినియోగించే వీలుండటం ఆటమ్‌ ప్రత్యేకత.

జజ్జర్‌ వద్ద వి–బోర్డ్స్‌ తయారీౖకై విశాక ఇండస్ట్రీస్‌ ఇప్పటికే రూ.100 కోట్లతో కొత్త ప్లాంటును స్థాపించింది. సెప్టెంబర్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. వార్షిక సామర్థ్యం 72,000 టన్నులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఈ ప్లాంటు నుంచి రూ.20 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. ప్లాంటు పూర్తి సామర్థ్యానికి చేరితే ఈ యూనిట్‌ నుంచి ఆదాయం రూ.80 కోట్లు సమకూరనుంది. 50 శాతం సామర్థ్యం 2019–20లో అందుబాటులోకి రావొచ్చని కంపెనీ ధీమాగా ఉంది.

Advertisement
Advertisement