టెల్కోలపై ‘ఏజీఆర్‌’ పిడుగు

15 Nov, 2019 03:48 IST|Sakshi

వొడాఫోన్‌ ఐడియాకు రూ.50,921 కోట్ల నష్టం

ఒక భారత కంపెనీకి ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికం

ఎయిర్‌టెల్‌ లాస్‌... రూ.23,045 కోట్లు

కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక త్రైమాసిక నష్టాలు

న్యూఢిల్లీ:  ఏజీఆర్‌పై (సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వొడాఫోన్‌ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్‌టెల్‌ కంపెనీ రూ.23,045 కోట్ల నికర నష్టాల్ని  ప్రకటించాయి. ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా రూ.74,000 కోట్లకు చేరింది. టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం (ఏజీఆర్‌) కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది.
 

క్యూ2లో ఎయిర్‌టెల్‌పై భారం 28,450 కోట్లు
టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్‌ త్రైమాసిక కాలానికి భారీగా నష్టాలు వచ్చాయి. ఏజీఆర్‌ (సవరించిన స్థూల ఆదాయం) విషయమై సుప్రీం కోర్ట్‌ ఇటీవల ఇచ్చిన తీర్పుతో కంపెనీకి ఈ క్యూ2లో అత్యధిక స్థాయిలో త్రైమాసిక నష్టాలు తప్పలేదు. గత క్యూ2లో రూ.119 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.23,045 కోట్ల నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ క్యూ2లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.21,199 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

కొత్త అకౌంటింగ్‌ విధానాలను అనుసరించినందువల్ల గత క్యూ2, ఈ క్యూ2 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. సుప్రీంకోర్టు ఏజీఆర్‌ విషయమై తాజాగా ఇచ్చిన తీర్పు కారణంగా స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీలు(ఎస్‌యూసీ), లైసెన్స్‌ ఫీజు తదితర అంశాలకు సంబంధించి ఈ క్యూ2లో ఈ కంపెనీపై రూ.28,450 కోట్ల భారం పడిం ది. దీంతో కంపెనీ నికర నష్టాలు రూ.23,045 కోట్లకు పెరిగాయి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం. ఏజీఆర్‌ భారం లేకుంటే కంపెనీ నికర నష్టాలు రూ.1,123 కోట్లుగా ఉండేవి. నిర్వహణ లాభం రూ. 6,343 కోట్ల నుంచి రూ.8,936 కోట్లకు పెరిగింది. భారత విభాగం ఆదాయం 3% పెరిగి రూ.15,361 కోట్లకు చేరింది. ఆఫ్రికా విభాగం ఆదాయం 13% ఎగసింది.  

వొడాఫోన్‌ ఐడియాపై పెనుభారం...
ఏజీఆర్‌ ప్రభావంతో వొడాఫోన్‌ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఇంత వరకూ ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించలేదు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో తమ నష్టాలు రూ.4,874 కోట్లని కంపెనీ వెల్లడించింది. ఇక ఆదాయం 42 శాతం ఎగసి రూ.11,146 కోట్లకు పెరిగిందని వివరించింది. సుప్రీం తాజా తీర్పు కారణంగా తాము చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలు రూ.44,150 కోట్లుగా ఉంటాయని అంచనా వేసిన వొడాఫోన్‌ ఐడియా, ఈ క్యూ2లో రూ.25,680 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఇరు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి.

ఫలితాలపై ప్రతికూల అంచనాలతోనే ఈ రెండు షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎయిర్‌టెల్‌ షేర్‌ బీఎస్‌ఈలో 1.5% నష్టంతో రూ.363 వద్ద ముగిసింది. వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 20% క్షీణించి రూ.2.95 వద్దకు చేరింది.

మొత్తం బకాయిలు రూ.1.4 లక్షల కోట్లు...
టెలికం విభాగం తాజా అంచనాల ప్రకారం... ఏజీఆర్‌కు సంబంధించి ఎయిర్‌టెల్‌ రూ.62,187 కోట్లు, (టాటా గ్రూప్‌ టెలికం కంపెనీలను, టెలినార్‌ను కూడా విలీనం చేసుకున్నందు వల్ల వాటి భారం ఎయిర్‌టెల్‌ మీదనే పడింది) వొడాఫోన్‌ ఐడియాలు రూ.54,184 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ బకాయిలను 3 నెలల్లోగా చెల్లించాలని సుప్రీం  తన తీర్పులో పేర్కొంది. తాజాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగానే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం విభాగం నోటీసులు జారీ చేసింది. మొత్తం టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.4 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా.

ఐడియా రివ్యూ పిటిషన్‌...!: ఏజీఆర్‌కు సంబంధించి స్పష్టత లేదంటూ గత నెలలోనే వెల్లడించాల్సిన ఆర్థిక ఫలితాలను ఎయిర్‌టెల్‌ వాయిదా వేసింది. కాగా టెలికం పరిశ్రమ  తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ దృష్ట్యా ప్రభుత్వం ఏజీఆర్‌పై సానుకూల నిర్ణయం తీసుకోగలదన్న ఆశాభావాన్ని క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా ఎయిర్‌టెల్‌ వ్యక్తం చేసింది. మరోవైపు ఏజీఆర్‌ విషయమై ఒక రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని వొడాఫోన్‌ ఐడియా సన్నాహాలు చేస్తోంది. ఏజీఆర్‌కు సంబంధించి సానుకూల నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటేనే తమ కంపెనీ కొనసాగగలదని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైననే తమ కంపెనీ మనుగడ ఆధారపడి ఉందని వివరించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు