కొత్త విమానాలు 1,600 కావాలి | Sakshi
Sakshi News home page

కొత్త విమానాలు 1,600 కావాలి

Published Fri, Mar 18 2016 12:39 AM

కొత్త విమానాలు 1,600 కావాలి

20 ఏళ్లలో రూ. 15 లక్షల కోట్లు అవసరం
మేకిన్ ఇండియాలో భాగంగా విడిభాగాల కొనుగోళ్లు
2020 నాటికి ఈ మొత్తం 2 బిలియన్ డాలర్లు
ఎయిర్‌బస్ వైస్ ప్రెసిడెంట్ జూస్ట్ వాన్‌డెర్ హైడెన్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌర విమానయాన రంగంలో ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటును నమోదు చేస్తున్న ఇండియాకి  వచ్చే ఇరవై ఏళ్లలో 1,600 కొత్త విమానాలు అవసరమవుతాయని విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ అంచనా వేసింది. ఇందుకోసం సుమారు రూ.15 లక్షల కోట్లు అవసరమవుతాయని ఎయిర్‌బస్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్, (ఆసియా, నార్త్ అమెరికా) జూస్ట్ వాన్‌డెర్ హైడెన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏవియేషన్ ప్రదర్శనలో భాగంగా విలేకరుల సమావేశంలో హైడెన్ మాట్లాడుతూ ఇందులో 100 కంటే ఎక్కువ సీట్ల సామర్థ్యం ఉన్న 1,230 విమానాలు, 380 భారీ విమానాలు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం ఇండియాలో 325 చిన్న విమానాలు, 53 భారీ విమానాలు సేవలు అందిస్తున్నాయి.

ప్రస్తుతం నెలకు పది లక్షల మందికిపైగా ప్రయాణం చేస్తున్నా విమానాశ్రమాల సంఖ్య 4కే పరిమితమయ్యిందని, 2034కి ఈ సంఖ్య 14కు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశీయ విమానయాన రంగం సగటున 8.4 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా ప్రయాణికుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందన్నారు. గతేడాది ఇండియా నుంచి 250 కొత్త విమానాలకు ఆర్డర్లు వచ్చాయన్నారు. ప్రస్తుత విమానాలతో పోలిస్తే 20 శాతానికిపైగా ఇంధన వ్యయాన్ని తగ్గించే ఏ-320 నియో, 3-321 నియోలకు మంచి డిమాండ్ ఉందని, ఈ ఏడాది చివరికల్లా వీటి డెలివరీ మొదలవుతుందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్థానికంగా విడిభాగాలను అత్యధికంగా వినియోగిస్తున్నామని, ప్రస్తుతం 500 మిలియన్ డాలర్లుగా ఉన్న వీటి కొనుగోళ్ల విలువ 2020 నాటికి 2 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు.

Advertisement
Advertisement