వారంటీ పొడిగిస్తే ఎవరికి లాభం? | Sakshi
Sakshi News home page

వారంటీ పొడిగిస్తే ఎవరికి లాభం?

Published Mon, Oct 12 2015 12:12 AM

వారంటీ పొడిగిస్తే ఎవరికి లాభం? - Sakshi

ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు... బైక్, కారు వంటి ఆటోమొబైల్స్ కావచ్చు... వీటిని కొనేటపుడు ప్రతిసారీ శ్రీధర్‌కు షోరూమ్ వాళ్లు ఒక ఆఫర్ ఇస్తుంటారు. ‘‘సర్! దీనికి ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉంది. తీసుకోండి’’ అని. అంటే... సదరు వస్తువుకు కంపెనీ ఇచ్చే వారంటీ కాకుండా డీలర్ ఇచ్చే అదనపు వారంటీ అన్నమాట. దానిక్కాస్త ఎక్స్‌ట్రా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అయితే శ్రీధర్ ప్రతి సందర్భంలోనూ వద్దని చెప్పేస్తూ ఉంటాడు. తరవాత బయటికొచ్చి... అరె! తీసుకుని ఉంటే బాగుండేదేమో!! అనుకుంటుంటాడు. మరి ఈ ఎక్స్‌టెండెడ్ (పొడిగించిన) వారంటీని తీసుకోవటం మంచిదా..? లేక వద్దని వదిలేయటమే మంచిదా? ఒకసారి చూద్దాం.
 
పొడిగించిన వారంటీ అంటే నిజానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదే. ఎందుకంటే ప్రతి వస్తువుకూ సాధారణంగా ఇచ్చే వారంటీ ఒకటుంటుంది. అది నెల కావచ్చు... ఏడాది కావచ్చు. ఈ గడువులో గనక వస్తువుకేదైనా అయితే కంపెనీ దాన్ని రిపేరు చేయటమో, లేక మార్చి కొత్తది ఇవ్వటమో చేస్తుంది. ఆ గడువు అయిపోయాక గనక ఆ వస్తువు దెబ్బతింటే అప్పుడు ఈ పొడిగించిన వారంటీ పనికొస్తుంది.  

బీమా కంపెనీలు ఎలా పనిచేస్తాయో మనకు తెలియంది కాదు. అవి క్లెయిమ్ రూపంలో చెల్లించే మొత్తం కంటే ప్రీమియం రూపంలో వసూలు చేసే మొత్తమే ఎక్కువగా ఉంటుంది. అప్పుడే అవి క్లెయిమ్‌లు చెల్లించ గలుగుతాయి. లేదంటే దివాలా తీస్తాయి. ఈ పొడిగించిన వారంటీ కూడా ఇలానే పనిచేస్తుంది. అంటే దీనర్థం పొడిగించిన వారంటీలో క్లెయిమ్‌లు ఎక్కువగా ఉండవనేగా!?
 
అంకెల్లో ఓ సారి చూద్దాం..
శ్రీధర్ ఎలా ఆలోచించాడో ఓ సారి చూద్దాం. తను ఓ ల్యాప్‌టాప్ కొందామనుకున్నాడు. పేరున్న రిటెయిలర్ దగ్గరకు వెళ్లాడు. రూ.36,000 ధర చెప్పిన రిటెయిలర్... కంపెనీ ఇస్తున్న ఏడాది వారంటీతో పాటు తాము రెండేళ్లు పొడిగింపు వారంటీ ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ రెండేళ్ల పొడిగింపు వారంటీ లేకుండా ల్యాప్‌టాప్ ఎంతని అడిగితే... ఆ వారంటీ (బీమా) ధర మైనస్ చేసి రూ.26,000కు ఇస్తానన్నాడు.

గమనించాల్సిందేంటంటే ఏడాదిలోపు ల్యాప్‌టాప్‌కు ఏదైనా అయితే తిరిగి కొత్తదిస్తారు. రూ.36,000 పెట్టి కొంటే ఈ గడువు మూడేళ్లకు పెరుగుతుంది. అదే 26వేలు పెట్టి కొంటే ఏడాది మాత్రమే వారంటీ. ఆ తరవాత ఒక్కరోజు గడిచినా రీప్లేస్‌మెంట్ ఉండదు. శ్రీధర్ ఆలోచన మరోలా ఉంది. ఎలాగూ ఏడాది వరకు వారంటీ ఉంటుంది. పెపైచ్చు ల్యాప్‌టాప్ 26వేలకే వస్తుంది. ఒకవేళ ఏడాది తరవాత ఏదైనా జరిగితే... రోజురోజుకూ టెక్నాలజీ మారుతోంది కనక అప్పటికి మార్కెట్లో ఉండే కొత్త టెక్నాలజీ ల్యాప్‌టాప్‌ను దాదాపు 26వేలకే కొనుక్కోవచ్చు.

అలా కాకుండా ప్రస్తుతం కొన్న మోడల్‌నే అప్పుడు కూడా కొనాలంటే పాతదై పోతుంది కనక ధర కూడా దాదాపు 15-20 వేల మధ్యనే ఉంటుంది. ఒకవేళ ల్యాప్‌టాప్‌కు ఏమీ కాకపోతే మొత్తం మిగిలినట్టే. ఇలా ఆలోచించాకే... రిటెయిలర్ ఎంత ఆశ చూపించినా, ఎంతగా భయపెట్టినా శ్రీధ ర్ లొంగలేదు. తన నిర్ణయానికే కట్టుబడి ఈ పొడిగింపు వారంటీ వద్దనుకున్నాడు.
 
మానసికంగా లాభమే!
శ్రీధర్‌లానే అందరూ చేయాలని లేదు. ఎందుకంటే ఈ పొడిగింపు వారంటీ తీసుకోవటం వల్ల ఇతర లాభాల మాటెలా ఉన్నా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ప్రిన్స్‌టన్ వర్సిటీకి చెందిన నోబెల్ విజేత డానియెల్ కానెమన్ వంటి మానసిక విశ్లేషకులు ఏమంటారంటే... ఏదైనా లాభం వల్ల కలిగే ఆనందం కన్నా నష్టం వల్ల కలిగే బాధ రెండింతలు ఎక్కువగా ఉంటుందట.

ఈ లెక్కన చూస్తే నష్టం వల్ల కలిగే బాధను, నష్టం వస్తుందనే ఒత్తిడిని దూరం చేసే పొడిగింపు వారంటీ మంచిదే. గతంలో శ్రీధర్ ఇలాంటి వారంటీలు అవసరం లేదని, వద్దని తన తోటి కస్టమర్లకు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఈ మానసిక ప్రశాంతత కోణంలో ఆలోచించాక తను ఆ సిఫారసు మానుకున్నాడులెండి!!.
 
అవసరమైనచోటే బీమా
ఎప్పుడైనా బీమా తీసుకునేది అవసరమైన చోటే. అంటే... తద్వారా జరిగే నష్టాన్ని మనం భర్తీ చేసుకోలేని పరిస్థితి ఉంటేనే! మెడిక్లెయిమ్, టర్మ్ ఇన్సూరెన్స్ అన్నీ ఇలాంటివే. ఎందుకంటే నష్టం జరిగినపుడు మనం కోల్పోయేదాన్ని ఈ పాలసీలు లేకుంటే భర్తీ చేసుకోవటం కష్టం. నిపుణులు చెప్పేదేంటంటే... ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో అలా కాదు. వాటికేదైనా జరిగితే ఆ నష్టాన్ని మనం భర్తీ చేసుకోగలం. మరి అలాంటపుడు బీమా ఎందుకనేది వారి ప్రశ్న.

ఇటీవల ‘బ్లూమ్‌బర్గ్’ చేసిన సర్వే ప్రకారం... ఈ పొడిగించిన వారంటీలు అమ్మకం దార్లకు ఊహించని లాభాల్ని అందిస్తున్నాయట. ఈ రకం వారంటీల కోసం కంపెనీలకయ్యే ఖర్చు చాలా తక్కువని, అవి వీటిద్వారా వినియోగదారులకు అందిస్తున్న ప్రయోజనాలు కూడా తక్కువ కావటంతో వాటికి లాభాలొస్తున్నాయని బ్లూమ్‌బర్గ్ వివరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement