షం‘షేర్లు’ ఏవి..? | Sakshi
Sakshi News home page

షం‘షేర్లు’ ఏవి..?

Published Fri, Jan 1 2016 3:12 AM

షం‘షేర్లు’ ఏవి..?

ఫైనాన్షియల్ మార్కెట్లలో కొత్త ఏడాది ఒడిదుడుకులు తగ్గుతాయని అంటున్నారు నిపుణులు. 2016లోనూ హెచ్చుతగ్గులుంటాయని, అయితే తీవ్రత గత ఏడాదికంటే తక్కువగా ఉంటుందని వారు చెపుతున్నారు. ఈక్విటీ మార్కెట్ పట్ల కొన్ని బ్రోకింగ్ కంపెనీలు ఆశావహ దృక్పధాన్ని వెల్లడిస్తుండగా, మరికొన్ని ఆచితూచి సూచనలిస్తున్నాయి. బంగారం ధర పెరుగుదల అంచనాలు మాత్రం మార్కెట్లో అంతగా లేవు. 2016లో దేశీయ ఈక్విటీ, గోల్డ్ మార్కెట్లపై వివిధ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్ సంస్థల అభిప్రాయాలు ప్రత్యేకంగా  ‘సాక్షి’ పాఠకుల కోసం...
 
 గడిచిన ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లో విచిత్రమైన అనుభూతిని చవిచూశాయి. తొలిసారిగా సెన్సెక్స్ 30,000, నిఫ్టీ 9,000 మార్కును అధిగమించినా... ఆ లాభాలు నిలవలేదు. ఏడాది మొత్తం మీద చూస్తే సెన్సెక్స్ 5 శాతం, నిఫ్టీ 4 శాతం నష్టపోయాయి. కానీ ఇదే సమయంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలను అందించాయి.  లార్జ్ క్యాప్ ఇండెక్స్ నష్టాల్లో ఉన్నా మిడ్‌క్యాప్ ఇండెక్స్ లాభాలను అందించడం గత పదేళ్ల చరిత్రలో ఇదే తొలిసారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా.. గ్రీస్, చైనా వృద్ధిరేటు మందగించడం, అమెరికా వడ్డీరేట్లు పెంపు ఇవన్నీ గతేడాది స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు గురి చేశాయి. గడిచిన ఏడాదికంటే ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తాయని, కానీ గతంలో లాగా మొత్తం సెక్టార్ కాకుండా ఆ సెక్టార్‌లోని ఎంపిక చేసిన షేర్లు మాత్రమే ర్యాలీ చేస్తాయంటున్నారు.
 
 లార్జ్ క్యాప్ బెటర్...

 గడిచిన ఏడాది మిడ్‌క్యాప్ ఇండెక్స్ 6 శాతం లాభాలను అందిస్తే లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 6 శాతం నష్టపోయింది. అంటే మిడ్‌క్యాప్‌తో పోలిస్తే లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 12 శాతం వెనుకబడి ఉంది. దీంతో విలువపరంగా లార్జ్‌క్యాప్ షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పొచ్చు. 2016లో అధిక పీఈతో ట్రేడ్ అవుతున్న షేర్ల నుంచి నగదు పటిష్టంగా ఉండి తక్కువ విలువ కలిగిన లార్జ్‌క్యాప్ షేర్లలోకి మారుతుందని అంచనా వేస్తున్నాం. 2016లో ఇండెక్స్ రాబడి అంచనాలను వేయడం కష్టం. ద్వితీయార్థానికి కాని సూచీల కదలికలపై ఒక స్పష్టత ఏర్పడదు.
 
 ఈ ఏడాది ఇండెక్స్‌ల కంటే షేర్ల వారీ ర్యాలీ జరుగుతుందని చెప్పొచ్చు. అంతర్జాతీయ పరిణామాలతో వృద్ధిరేటు కోలుకోవడం రెండేళ్లు ఆలస్యం కావడంతో కంపెనీల పనితీరు మెరుగయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకసారి అంతర్జాతీయంగా వృద్ధిరేటు మెరుగయితే ఇప్పటి వరకు బాగా దెబ్బతిన్న బ్యాంకింగ్, మెటల్, కమోడిటీ రంగాలు మెరుగయ్యే అవకాశాలుంటాయి. మొత్తం మీద చూస్తేఖరీదైన మిడ్‌క్యాప్ షేర్లకు దూరంగా ఉంటూ ఎంపిక చేసుకున్న లార్జ్‌క్యాప్ షేర్లలో క్రమేపీ ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను.
 ఆదాయం పెరగకపోయినా

 లాభాలు పెరుగుతాయి..
 కమోడిటీ ధరలు తగ్గడం వల్ల అత్యధికంగా లబ్ధి పొందే దేశాల్లో ఇండియా ఒకటి. దీని వల్ల చాలా కంపెనీల ఆదాయాలు పెరగకపోయినా.. నిర్వహణా వ్యయాలు తగ్గడం ద్వారా లాభాలు పెరిగే అవకాశాలున్నాయి. ఆ మేరకు షేర్ల ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు కాన్సిలిడేషన్ స్థితిలో ఉంటాయని అంచనా. ప్రస్తుం మన సూచీలు అంత ఖరీదు అని చెప్పలేం. అలా అని చౌకగా లేవు. ఈ ఏడాది సెక్యులర్ బుల్‌ర్యాలీ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎంపిక చేసిన షేర్లు ర్యాలీ చేసే అవకాశం ఉంది.  కమోడిటీ ధరలు తగ్గడం వల్ల లబ్ధిపొందే రంగాలకు చెందిన షేర్లు బాగుంటాయి.  ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు కొనసాగే అవకాశాలే ఎక్కువ. ఈ ఏడాది మార్కెటో  ‘సిప్’లో ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను.
 
 బంగారం సంగతి ఇదీ..
 ఈ ఏడాది కూడా బంగారం డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంగారం కదలికలను అమెరికా వడ్డీరేట్లు, చైనా ఆర్థిక వ్యవస్థ ప్రభావితం చేస్తాయి. అమెరికా వడ్డీరేట్లు వేగంగా పెంచితే బంగారం ధరలు మరింత కిందకు దిగివస్తాయి. అలా కాకుండా చైనా కరెన్సీ విలువను తగ్గించుకుంటే బంగారం ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయి.
 
 ఏడాది మొత్తం మీద చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,000 - 1,120 డాలర్ల శ్రేణిలో కదిలే అవకాశాలున్నాయంటున్నారు జెన్ మనీ డెరైక్టర్     ఆర్.నమశ్శివాయ. ఈ ఏడాది 1,000 డాలర్ల కిందకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు ఉత్పత్తి వ్యయానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ శ్రేణిలో కొద్దిగా మద్దతు లభించే అవకాశాలున్నాయంటున్నారు. మధ్యలో బంగారం పెరిగినా వచ్చే మూడేళ్లలో క్రమేపి 900 - 950 డాలర్ల శ్రేణికి తగ్గుతుందని నమశ్శివాయ అంచనా వేస్తున్నారు. ఇక రూపాయల్లో చూస్తే పది గ్రాముల బంగారం ధర రూ. 23,500 నుంచి రూ. 26,500 (ఎంసీఎక్స్ ధరలు) శ్రేణిలో కదలొచ్చు.
 
  ఈ ఏడాది కూడా ఈక్విటీలతో పోలిస్తే బంగారం లాభాలు అందించే అవకాశాలు లేవంటున్నారు యూటీఐ ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బాగా క్షీణించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (క్యాడ్) అదుపులో ఉండటంతో కరెన్సీ కదలికలు స్థిరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నా... రూపాయల్లో ఈక్విటీలను మించి లాభాలను అందించే అవకాశం లేదు. ఒకవేళ బంగారం ధరలు పెరిగితే గరిష్టంగా ఎనిమిది శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నంబియార్ అంచనా వేస్తున్నారు.

 నిఫ్టీ టార్గెట్ 9,720...
 గతేడాది ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలను అందించినా.. మిగిలిన రంగాలతో పోలిస్తే ఈక్విటీలే మెరుగైన పనితీరు కనపర్చాయి. రానున్న కాలంలో ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల కంటే ఈక్విటీలే అధిక లాభాలను అందిస్తాయని అంచనా వేస్తున్నాం. మూడేళ్లలో దేశీయ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెట్టింపై 2020 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లు దాటుతుంది. వచ్చే 15 నెలల కాలానికి నిఫ్టీ 7,560 - 9,720 శ్రేణిలో కదులుతుంది. కన్జూమర్, ఫైనాన్షియల్స్, ఇన్‌ఫ్రా, ఆటోమొబైల్, సిమెంట్, ఎనర్జీ అండ్ పవర్ సెక్టార్స్‌పై బుల్లిష్‌గా ఉన్నాం. అంతర్జాతీయ వృద్ధిరేటు, ముడి చమురు ధరలు వేగంగా పెరగడం, మిడిల్ ఈస్ట్, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం వంటివి మార్కెట్‌పై ప్రభావం చూపే ప్రతికూలాంశాలు.
 
 ఇవీ బెట్స్...

 టాప్ 10 లార్జ్ క్యాప్ షేర్లు: హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, మారుతీ, ఎన్‌టీపీసీ, రిలయన్స్, ఎస్‌బీఐ, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్. టాప్ 10 మిడ్‌క్యాప్ షేర్లు: బీఈఎంఎల్, సెంచురీ ప్లే, కాన్‌కర్, హెస్టర్ బయోసెన్సైస్, హెచ్‌ఎస్‌ఐఎల్, ఇనాక్స్ విండ్, కెటైక్స్ గార్మెంట్స్, ఎన్‌ఐఐటీ, ఎస్‌కేఎస్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్.
 
 ఒడిదుడుకులకు అవకాశం లేదు

 గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు గురయిన స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది క్రమేపీ కోలుకుంటాయి. అమెరికా ఫెడరల్ వడ్డీరేట్లు పెంచడం, ఆ ప్రభావాన్ని మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకోవడంతో ప్రస్తుతానికి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అంశాలు ఏమీ కనిపించడం లేదు. మళ్లీ అమెరికా వడ్డీరేట్లు పెంచుతుందా లేదా అన్నది వచ్చే డేటాపై ఆధారపడి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుండటంతో రానున్న నెలల్లో కంపెనీల లాభాలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకులపై బుల్లిష్‌గా ఉన్నాం, రానున్న కాలంలో రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాల్లో గవర్నమెంట్ వ్యయాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యుత్, ఐటీ, ఫార్మా, ఆటో రంగాలకు చెందిన షేర్లలో కదలికలు కనిపించొచ్చు.
 
 

Advertisement
Advertisement