విప్రో ఫలితాలు.. ప్చ్‌! | Sakshi
Sakshi News home page

విప్రో ఫలితాలు.. ప్చ్‌!

Published Thu, Jan 26 2017 1:24 AM

విప్రో ఫలితాలు.. ప్చ్‌!

6 శాతం తగ్గిన లాభం
ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌

బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలం (2016–17, క్యూ3)లో 6 శాతం తగ్గింది. అంతక్రితం ఏడాది క్యూ3లో రూ.2,246 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.2,115 కోట్లకు తగ్గిందని విప్రో తెలిపింది. అయితే ఆదాయం మాత్రం రూ.12,952 కోట్లు నుంచి 6 శాతం వృద్ధితో రూ.13,765 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత అకౌటింగ్‌ ప్రమాణాలకనుగుణంగా ఆర్థిక ఫలితాలను వెల్లడించామని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

గైడెన్స్‌ మిస్‌..
ఐటీ సేవల విభాగం ఆదాయం గత క్వార్టర్‌తో పోల్చితే 0.7 శాతం క్షీణించి 190కోట్ల డాలర్లకు తగ్గిందని విప్రో చీఫ్‌ ఫైనాన్షియల్‌  ఆఫీసర్‌ జతిన్‌ దలాల్‌ చెప్పారు. ఇది కంపెనీ ఆదాయ ఆర్జన అంచనాలు(192–194 కోట్ల డాలర్లు) కంటే తక్కువగా ఉంది. ఇక రానున్న క్వార్టర్‌లో ఆదాయం 192–194 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చన్న అంచనాలను జతిన్‌ వెల్లడించారు.డిజిటల్‌ ఈకో సిస్టమ్‌ విభాగం 10 శాతం వృద్ధి సాధించిందని, తమ మొత్తం ఆదాయంలో దీని వాటా 22 శాతమని వివరించారు. ఐటీ ఉత్పత్తుల విభాగం రూ.570 కోట్ల ఆదాయం సాధించిందని తెలి పారు. సాధారణంగా ఈ క్యూ3 క్వార్టర్‌ ఐటీ కంపెనీలకు బలహీనంగా ఉంటుందని, అయినప్పటికీ, నిర్వహణ మార్జిన్లు50 బేసిస్‌ పాయింట్లు పెరిగాయని, పటిష్టమైన నగదు నిల్వలను సాధించామని  వివరించారు. గత ఏడాది చివరి నాటికి ఐటీ సేవల విభాగంలో 1,79,129 మంది ఉద్యోగులున్నారని తెలిపారు.

విప్రో వెంచర్స్‌ పెట్టుబడులు..: కంపెనీల కొనుగోళ్లకు గత ఏడాది వంద కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేశామని విప్రో సీఈఓ అబిదాలి జడ్‌ నీమూచ్‌వాలా చెప్పారు. విప్రో వెంచర్స్‌  ద్వారా ఆరు సంస్థల్లో పెట్టుబడులు పెట్టామని, హŸరైజన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా 8 ఐడియాలకు నిధులందించామని వివరించారు. మార్కెట్‌ ముగిసిన తర్వాత విప్రో ఫలితాలు వెలువడ్డాయి.

బడ్జెట్‌పై ఆశలతో పలు రంగాల కంపెనీల షేర్లు పెరిగినప్పటికీ, హెచ్‌ 1 బి వీసా నిబంధనలపై ఆందోళన కారణంగా విప్రో షేర్‌ బీఎస్‌ఈలో 1.6 శాతం నష్టపోయి రూ.473 వద్ద ముగిసింది.

విప్రో చేతికి బ్రెజిల్‌ ఐటీ సంస్థ
బ్రెజిల్‌కు చెందిన ఐటీ సంస్థ, ఇన్ఫోసర్వర్‌ ఎస్‌ఏను 87 లక్షల డాలర్లకు విప్రో కొనుగోలు చేసింది. ఈ మేరకు సదరు బ్రెజిల్‌ ఐటీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని విప్రో తెలిపింది. ఇన్ఫోసర్వర్‌కు బ్రెజిల్‌ భారీ బ్యాంక్‌లు క్లయింట్లుగా ఉన్నాయని, బ్రెజిల్, ఇతర లాటిన్‌ అమెరికా దేశాల్లో  మరింతగా విస్తరించడానికి ఈ కొనుగోలు దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ కొనుగోలుకు బ్రెజిల్‌ ప్రభుత్వ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని తెలిపింది.  ఇప్పటికే విప్రో ఐదు లాటిన్‌ అమెరికా దేశాల్లో(అర్జెంటినా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో) కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement