ప్రపంచంలో అతి పలుచని ల్యాప్టాప్ | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అతి పలుచని ల్యాప్టాప్

Published Tue, Sep 13 2016 6:38 AM

ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ డెరైక్టర్ చంద్రహాస్

ఏసర్ స్విఫ్ట్-7 అక్టోబరులో భారత్‌కు
భారత్ కోసం ప్రత్యేక స్మార్ట్‌ఫోన్లు
సాక్షితో ఏసర్ సీనియర్ డెరైక్టర్ చంద్రహాస్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెక్నాలజీ కంపెనీ ఏసర్ అక్టోబరు తొలి వారంలో స్విఫ్ట్-7 ల్యాప్‌టాప్‌ను భారత్‌లో విడుదల చేస్తోంది. 9.98 మిల్లీ మీటర్ల మందంతో తయారైన ఈ ల్యాప్‌టాప్ ప్రపంచంలో అతి పలుచనిది. ఈ నెల తొలి వారంలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఏ-2016 టెక్నాలజీ షోలో కంపెనీ దీనిని ఆవిష్కరించింది. భారత్‌లో ధర రూ.85,000 నుంచి రూ.1 లక్ష మధ్య ఉండే అవకాశం ఉంది. 13.3 అంగుళాల స్క్రీన్, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, 9 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లున్నాయి. యూఎస్‌బీ టైప్-సి పోర్టులు రెండు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో తొలిసారిగా కర్వ్‌డ్ డిస్‌ప్లేతో ప్రిడేటర్ 21 ఎక్స్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను సైతం  కంపెనీ ఐఎఫ్‌ఏ-2016 టెక్నాలజీ షోలో ఆవిష్కరించింది. ఈ ఏడాదే ఇది ఇక్కడి మార్కెట్లో అడుగు పెట్టనుంది.

స్మార్ట్‌ఫోన్లపై ఫోకస్..
ప్రస్తుతం ఏసర్ భారత్‌లో రెండు స్మార్ట్‌ఫోన్ మోడళ్లను విక్రయిస్తోంది. విభిన్న ఫీచర్లతో ఈ ఏడాదే మరిన్ని మోడళ్లు రానున్నాయని ఏసర్ ఇండియా కంజ్యూమర్ బిజినెస్ సీనియర్ డెరైక్టర్ చంద్రహాస్ పాణిగ్రాహి తెలిపారు. కంప్యూటర్ మాల్ ఏర్పాటు చేసిన ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. స్మార్ట్‌ఫోన్లపైనా పెద్ద ఎత్తున దృష్టిసారించనున్నట్టు చెప్పారు. భారత మార్కెట్ కోసం ప్రత్యేక మోడళ్లు తీసుకు వచ్చే విషయమై బోర్డు స్థాయిలో చర్చిస్తున్నట్టు వివరించారు. ఇక ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు దేశవ్యాప్తంగా 90 ఉన్నాయి. వీటిని 2017 డిసెంబరుకల్లా 200లకు చేర్చనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 3, తెలంగాణలో 10 ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లను కంపెనీ నిర్వహిస్తోంది.

ల్యాప్‌టాప్‌ల తయారీ..
పాండిచ్చేరిలో ఉన్న ప్లాంట్‌లో డెస్క్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్న ప్లాంటు నుంచి భారత్‌కు ల్యాప్‌టాప్‌లను దిగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలు అందిస్తే ల్యాప్‌టాప్‌ల తయారీని దేశీయంగా చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్టు చంద్రహాస్ వెల్లడించారు. పర్సనల్ కంప్యూటర్ మార్కెట్‌లో దేశంలో ఏటా 90 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఈ రంగంలో ఏసర్‌కు 15% మార్కెట్ వాటా ఉంది.

కంపెనీ ఏటా 20% వృద్ధి చెందుతోంది. డిటాచేబుల్, కన్వర్టబుల్, గేమింగ్ విభాగంలో పీసీలకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీ తెలిపింది. 2016-17లో పీసీ మార్కెట్ నిలకడైన వృద్ధిని నమోదు చేస్తుందని ఏసర్ అంచనా వేస్తోంది. పీసీల అమ్మకాల్లో ఆఫ్‌లైన్ వాటా 84 శాతంగా ఉంది. సర్వీసింగ్, గెడైన్స్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆఫ్‌లైన్ వైపే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని కంపెనీ అంటోంది.

Advertisement
Advertisement