జన హారతి | Sakshi
Sakshi News home page

జన హారతి

Published Wed, Jan 3 2018 7:47 AM

people supports ys jagan in praja sankalpa yatra - Sakshi

సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలోని నగిరిమడుగు గ్రామానికి చెందిన రాజమ్మ, నారాయణమ్మ మరికొంతమంది మహిళలు మంగళవారం వేకువజామునే నిద్రలేచారు. బస్తా చామంతి పువ్వులు సేకరించి పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వాయల్పాడుకు చేరుకున్నారు. తమ అభిమాన నేత వైఎస్‌ జగన్‌ నడిచొచ్చే దారిలో ఆ పువ్వులు పరిచారు. చేతిలో ఇత్తడిపళ్లెం.. అందులో ఎర్రనీళ్లు, తమలపాకులతోపాటు కర్పూరంతో జగన్‌ రాకకోసం నిరీక్షించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ తమను సమీపించగానే.. ఇత్తడిపళ్లెంలోని కర్పూరం వెలిగించి దూరం నుంచి దిష్టితీసి కిందపారబోశారు. దీనిపై అడిగితే.. ‘‘జనంకోసం వందల కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తున్నాడు నాబిడ్డ. ఎంతోమంది కళ్లు పడి ఉంటాయి. నా బిడ్డ క్షేమంగా ఇంటికి చేరాలి. ముఖ్యమంత్రిగా తిరిగి మా ఊరికి రావాలి. అంతకంటే మాకు వేరే కోరిక లేదు నాయనా?’’ అంటూ రాజమ్మ, నారాయణ ఉద్వేగంగా మాట్లాడారు.

ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ వారిని కలిశారు. వారి క్షేమ సమాచారాలడిగి తెలుసుకున్నారు. పింఛను వస్తుందా? రుణాలు మాఫీ అయ్యాయా? మీ ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటూ ఆరా తీశారు. దీంతో ఆ మహిళల ఆనందానికి అంతులేదు. ‘ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో నాయనా’ అంటూ దీవించి ముందుకు సాగనంపారు. నగరిమడుగుకు చెందిన మహిళలే కాదు.. శివపురం, పత్తేపురం, ఓబులంపల్లి, జర్రావారిపల్లి, దండువారిపల్లి, గొల్లపల్లి, నాగంవారిపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాలకు చెందిన మహిళలు, రైతులు, యువకులు, ఉద్యోగులు భారీఎత్తున వాయల్పాడుకు తరలివచ్చి వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించారు. వేలాదిమంది జగన్‌తో పాదం కలిపారు. ప్రభుత్వం తమను మోసగిస్తున్న తీరును ఆయనకు విన్నవించారు. ‘జగనన్నా రావాలి... కావాలి జగనన్నా’ అని నినదిస్తూ ముందుకు కదిలారు.  మంచూరు, బూడిదవేడులకు చెందిన చెక్కభజన బృందంవారు వాయల్పాడుకు చేరుకుని.. ఉదయం నుంచి పాటలు పాడుతూ, భజన చేస్తూ జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 

రిటైరైనా ప్రభుత్వం పింఛన్‌ ఇవ్వలేదు
రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖలో సుమారు 40 ఏళ్లు పనిచేసి రిటైరైన ఉద్యోగులు మంగళవారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను కలిశారు. చిత్తూరు జిల్లాలో సుమారు 350 మంది పదవీ విరమణ పొందామని, అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి పింఛన్, ఇతర అలవెన్సులు రాలేదని ఆవేదన వెలిబుచ్చారు. 

వేదనలు... కళ్లు చెమర్చే నివేదనలు...
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దారిపొడవునా వేదనలు...కళ్లు చెమర్చే నివేదనలే. రుణం మాఫీ కాక అన్నదాతలు, అప్పులు తీరక డ్వాక్రా మహిళలు, ఉద్యోగాలు రాక యువకులు, ఉపాధి దొరక్క కూలీలు, పింఛను అందక పండుటాకులు పడుతున్న అవస్థలెన్నో.. ప్రజాసంకల్పయాత్ర ద్వారా తమ వద్దకే వస్తున్న రాజన్నబిడ్డకు వీరంతా అర్జీలిచ్చి తమ ఆక్రోశాన్ని వెళ్లబోసుకున్నారు.   ప్రతిపక్ష నేత వారికి భరోసానిస్తూ ధైర్యం చెప్పారు.

బియ్యం ఇవ్వట్లేదు...
ఇంతకుముందు రేషన్‌ షాపులో 35 కిలోల బియ్యం ఇచ్చేవారు. ఆరు నెలలుగా ఇవ్వట్లేదు. భర్త చనిపోయాడు. నాకు పింఛను కూడా రావట్లేదు. మాలాంటోళ్లు ఎలా బతకాలి. తెల్లారితో లేవంగనే పూట గడిచేదెట్లో తెలియక భయమేస్తోంది సామీ.. అయినా సరే. ఈ దినాన నా బిడ్డ(వైఎస్‌ జగన్‌) నా దగ్గరకొచ్చాడు. నా కన్నీళ్లను తుడిచాడు. నాతో మాట్లాడాడు. అదిచాలు నాకు. ఇంకేం వద్దు. ఎలాగైనా బతికేస్తా.
–రాజమ్మ, చినతిప్పసముద్రం, చిత్తూరు జిల్లా.

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసే సీపీఎస్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దుచేయాలి. ఎలాగైనా మీరే సాయం చేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే సీపీఎస్‌ విధానాన్ని వెనక్కి తీసుకునే వీలుంది. మీరే పరిశీలించాలి. –వాల్మీకిపురం పీవీసీ స్కూల్‌ ఉపాధ్యాయులు

Advertisement
Advertisement