ఐపీఎల్‌ నిరసనలపై స్పందించిన రజనీ | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ నిరసనలపై స్పందించిన రజనీ

Published Wed, Apr 11 2018 10:47 AM

Rajinikanth Slams Anti-IPL Protesters, Says Violence Is No Solution - Sakshi

సాక్షి, చెన్నై : చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను వ్యతిరేకిస్తూ హింసాత్మక నిరసనలు చోటుచేసుకోవడం పట్ల తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. సమస్యలకు హింస ఎంతమాత్రం పరిష్కారం కాదని అన్నారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జలాల పంపిణీపై ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిరసనకారులు వ్యతిరేకిస్తున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లపై నిరసనల్లో హింస నెలకొనడం పట్ల రజనీకాంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా నిరసనలు దేశానికి ప్రమాదకరమని ఆయన ట్వీట్‌ చేశారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసు సిబ్బందిపై దురుసుగా వ్యవహరించిన వారిని శిక్షించేందుకు మరింత కఠిన చట్టాలు అవసరమని రజనీ అన్నారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌లను వ్యతిరేకిస్తూ మంగళవారం చెన్నైలో తమిళ అనుకూల గ్రూపుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో నిరసనకారులు ఖాకీలపై దాడులకు దిగారు. మరికొందరు చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాళ్ల దుస్తులైన యల్లో జెర్సీలను దగ్ధం చేశారు. మరోవైపు ఎంఏ చిదంబరం స్టేడియంలో సీఎస్‌కే-కేకేఆర్‌ మ్యాచ్‌ జరుగుతుండగా తమిళ గ్రూపులకు చెందిన ఇద్దరు కార్యకర్తలు మైదానంలోకి చెప్పులు విసిరారు. కావేరీ వివాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఐపీఎల్‌ మ్యాచ్‌లు చెన్నైలో నిర్వహిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. 

Advertisement
Advertisement