కెనాల్‌లో పడిన బస్సు : 20 మంది మృతి | Sakshi
Sakshi News home page

కెనాల్‌లో పడిన బస్సు : 20 మంది మృతి

Published Mon, Jan 29 2018 5:00 PM

20 Killed After Bus falls into river - Sakshi

దౌల్తాబాద్‌, పశ్చిమబెంగాల్‌ : పశ్చిమ బెంగాల్‌లోని దౌల్తాబాద్‌ గ్రామ సమీపంలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులో 56 మంది ప్రయాణిస్తుండగా.. ఇప్పటివరకూ కేవలం ఏడుగురి ఆచూకీ మాత్రమే లభ్యమైంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు నదియా జిల్లాలోని కరీంపూర్‌ నుంచి ముషీరాబాద్‌లోని బెర్హంపూర్‌కు బయల్దేరింది. అజయ్‌ నదిపై నిర్మించిన బాల్లీ బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. దీంతో ప్రయాణీకులను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పోలీసులు, రెస్క్యూ టీంలకు సమాచారం అందించారు.

వారు సమయానికి సంఘటనాస్థలికి రాకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మరింత ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసుల వాహనాలకు నిప్పుపెట్టారు.

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు సీఎం మమతా బెనర్జీ రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

Advertisement
Advertisement