విలు విద్య పేరుతో మోసం | Sakshi
Sakshi News home page

విలు విద్య పేరుతో మోసం

Published Fri, Jan 12 2018 12:02 PM

10 lakh cheating in archery training fraud case - Sakshi

ఒంగోలు క్రైం: విలు విద్య పేరుతో ఓ వ్యక్తి ఒంగోలు నగరంలో పలువురిని మోసం చేశాడు. బాధితులు ఒంగోలు ఒన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విలు విద్య పేరుతో మోసం చేసిన స్థానిక కమ్మపాలేనికి చెందిన నందనం హరీష్‌బాబును ఎస్‌ఐ ఎం.దేవకుమార్‌ అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపారు.

ఏం జరిగిందంటే..
నగరంలోని రంగారాయుడుచెరువు వద్ద ఉన్న గాంధీపార్కులో ఒంగోలు కమ్మపాలేనికి చెందిన నందనం హరీష్‌బాబు తాను విలు విద్యలో శిక్షణనిస్తానంటూ విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మబలికాడు. దీంతో తమ చిన్నారులకు విలు విద్యలో శిక్షణ ఇప్పిస్తే ఉన్నత చదువుల్లో అవకాశాలతో పాటు ఉద్యోగావకాశాలు కూడా మెండుగా ఉంటాయని భావించి తల్లిదండ్రులు అతని వద్ద చేర్పించారు. శిక్షణ పేరుతో నెలల తరబడి తల్లిదండ్రుల వద్ద పెద్ద మొత్తాల్లో నగదు వసూలు చేశాడు. విల్లు కోసం, బాణాల కొనుగోలు కోసం డబ్బులు కావాలని అడగడంతో వేలకు వేలు ఇచ్చారు. విల్లు, బాణాలు కొందరికీ ఇచ్చి మరికొందరికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ వచ్చాడు. నిర్మల్‌నగర్‌కు చెందిన జాస్టి రామారావు తన వద్ద రూ.60 వేలు తీసుకొని మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించాడు.

నగదుతో పాటు వారి వద్ద ఏటీఎం కార్డు కూడా తీసుకొని నగదు కూడా డ్రా చేశాడు. తీరా విల్లు, బాణాలు ఇవ్వకపోవడంతో మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సుజాతనగర్‌కు చెందిన భవనాశి ప్రవల్లిక విల్లు, బాణాల కోసం రూ.98 వేలిచ్చింది. కమ్మపాలేనికి చెందిన పెండ్యాల రామకృష్ణ రూ.59 వేలిచ్చాడు. గద్దలగుంటకు చెందిన నత్తల శ్రీనివాసరావు రూ.25 వేలు ముట్టజెప్పాడు. బల్లిపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల కోసం రూ.70 వేలిచ్చాడు. ఇలా హరీష్‌బాబు మోసాలను ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. వాస్తవానికి రాయల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ పేరుతో నిర్వహిస్తున్న సంస్థకు అసలు స్పోర్ట్స్‌ అథారిటీ నుంచి అనుమతే లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. హరీష్‌బాబు పోటీల్లో గెలిచానని చూపిస్తున్న సర్టిఫికెట్లు కూడా నకిలీవని తెలింది. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు.

Advertisement
Advertisement