పెళ్లి పత్రికల్లో మత్తు పదార్థాలు పెట్టి.. | Sakshi
Sakshi News home page

పెళ్లి పత్రికల్లో మత్తు పదార్థాలు పెట్టి..

Published Sun, Feb 23 2020 5:58 AM

5 kg of ephedrine worth Rs 5 crore seized at Karnataka International Airport - Sakshi

సాక్షి, బెంగళూరు : బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో భారీమొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. పెళ్లిపత్రికల్లో రహస్యంగా తరలిస్తున్న రూ.5.05కోట్ల విలువైన ఎఫెడ్రిన్‌ అనే మత్తు మందును సీజ్‌ చేశారు. శనివారం 5.49 కేజీల డ్రగ్స్‌ను పెళ్లిపత్రికల్లో గుట్టుగా అమర్చి తరలిస్తుండగా కార్గో విభాగంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.మదురైకి చెందిన వ్యక్తి డ్రగ్స్‌ దాచిన 43 శుభలేఖలను ఆస్ట్రేలియాకు తరలిస్తున్నాడు. కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా పత్రికల మధ్య అమర్చిన ఎఫెడ్రిన్‌ ప్యాకెట్లు బయటపడ్డాయి.  

18న రూ.5 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత 
ఇదే కార్గో విభాగంలో ఈ నెల 18న బట్టలు కుట్టే యంత్రంలో రూ.5 కోట్ల ఖరీదైన ఎఫెడ్రిన్‌ను రవాణా చేస్తుండగా కస్టమ్స్‌ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడడం కలవరపరుస్తోంది. దీంతో కస్టమ్స్‌ అధికారులు మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. తరచుగా డ్రగ్స్‌ రవాణా కేసులు బయటపడడం చూస్తుంటే మత్తు రవాణాకు దుండగులు బెంగళూరు ఎయిర్‌పోర్టును ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. చెన్నై, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో తనిఖీలను ముమ్మరం చేయడంతో ఇక్కడి నుంచి స్మగ్లింగ్‌కు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  

Advertisement
Advertisement