ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్‌

22 Nov, 2019 10:39 IST|Sakshi
ఏసీబీ అధికారులకు పట్టుబడిన మక్తల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ హబీబొద్దీన్, మరో వ్యక్తి అరీస్‌

సాక్షి, మక్తల్‌(మహబూబ్‌నగర్‌): లంచం తీసుకుంటూ మక్తల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ హబీబొద్దిన్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ రైతు తాను కొనుగోలు చేసిన భూమిని తమ పేర రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందిగా కోరగా.. రూ.75వేలు డిమాండ్‌ చేశాడు. ఈమేరకు సదరు రైతు ఏసీబీ అధికారులకు విషయం చెప్పాడు. చివరికి ఓ మధ్యవర్తి ద్వారా లంచం డబ్బులను తీసుకోగా.. సదరు సబ్‌రిజిస్ట్రార్‌ను, మధ్యవర్తిని గురువారం ఏసీబీ అధికారులు కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేశారన్న విషయం తెలియడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

18 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ విషయమై.. 
హైద్రాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన రైతు వెంకట్‌రెడ్డి మక్తల్‌ మండలం సంగంబండకి చెం దిన రైతుల దగ్గర సర్వే నంబర్‌ 200లో 18 ఎకరాల భూమిని ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ భూమిని తాను, తన సోదరుడి పేర్లపై రిజిస్ట్రేష న్‌ చేసుకునేందుకు రెండు సార్లు కార్యాలయాని కి వెళ్లి విన్నవించాడు. ఎంతకూ సదరు సబ్‌రి జిస్ట్రార్‌ హబీబొద్దీన్‌ లెక్కచేయలేదు. అసలు వి షయం కనుక్కునేందుకు కొందరిని సంప్రదిం చాడు. దీంతో ఓ మధ్యవర్తి లంచం డిమాండ్‌ చేశాడు. ఎన్నో భేరసారాల తర్వాత చివరికి రూ.75వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని సదరు అధికారి పేర్కొన్నాడని తెలిపారు. దీంతో చేసేది లేక మొదట పని పూర్తి చేయాలని, తర్వాత డబ్బు ఇస్తానని రైతు పేర్కొన్నాడు. 

గతంలో ఇద్దరు అధికారులు
గత 15ఏళ్ల క్రితం మక్తల్‌కు చెందిన రైతు భూమి రిజిస్టేషన్‌ విషయంలో లంచం డిమాండ్‌ చేయడంతో ఇదే కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులకు పట్టించారు. అలాగే, మూడేళ్ల క్రితం మక్తల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఓను ఏసీబీ చేతికి పట్టించారు. ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్‌ హబీబోద్దీన్‌ను పట్టుకోవడంతో ఏసీబీ దాడులు నిర్వహించడం పట్టణంలో మూడోసారి అవుతుంది.

వల పన్ని పట్టుకున్నారిలా..
ఈమేరకు 18ఎకరాల భూమిని రైతు వెంకట్‌రెడ్డి, అతని సోదరుడి పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అధికారి హబీబోద్దీన్‌తో ఈ నెల 6వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు ఈ నెల 14వ తేదీన భూమి రిజిస్ట్రేషన్‌ చేయించారు. పని పూర్తయ్యిందని, ఒప్పందం ప్రకారం లంచం డబ్బులు ఇవ్వాల్సిందిగా రైతును కోరారు. వెంటనే రైతు జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులకు 1064 నంబర్‌కు ఫోన్‌ చేసి అక్కడికి వెళ్లిన వారిని ఆశ్రయించారు. వారి పథకం ప్రకారం.. గురువారం మక్తల్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో తమ భూమికి సంబందించిన పత్రాలను తీసుకునేందుకు రైతు వచ్చాడు. ఈమేరకు సబ్‌ రిజిస్ట్రార్‌ హబీబొద్దిన్‌ దగ్గర ఉండే మక్తల్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ వ్యక్తి అరీస్‌కు రైతు వెంకట్‌రెడ్డి రూ.75వేలు అందజేశాడు. అనంతరం డబ్బులను అరిస్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు ఇచ్చాడు.

ఏసీబీ అధికారులు వేసిన పథకం ప్రకారమే రైతు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, సీఐలు ప్రవీణ్‌కుమార్, లింగంస్వామి సబ్‌రిజిస్ట్రార్‌ను తన కార్యాలయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారి చేతులు కడిగించి ఎరుపు రంగు రావడంతో సబ్‌రిజిస్ట్రార్‌ హబీబోద్దిన్, అతనికి సహకరించిన అరిస్‌.. ఇద్దరిని పట్టుకున్నారు. సాయంత్రం 6.30 వరకు కార్యాలయంలోనే విచారణ జరిపి అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి  కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ప్రతాప్‌ విలేకర్లకు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు సంప్రదించాలని ఆయన సూచించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొ దర్యాప్తు జరుపుతామని తెలిపారు.

కార్యాలయంలో.. అంతా ఇష్టారాజ్యం
మక్తల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి అసలు సమయ పాలనే లేదు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఎప్పుడు వస్తే అప్పుడే రిజిస్టేషన్‌ చేయాలి. చాలామటుకు లావాదేవీలన్నీ ఫోన్లు, మరికొందరు దళారులు, కార్యాలయం వద్ద ఉన్న కొందరు డాక్యుమెంట్‌ షాపులకు చెందిన వారి ద్వారానే జరిగేవని పేర్కొంటున్నారు. ఇక్కడికి ఏ అధికారి వచ్చినా డబ్బులు ఇస్తేనే పనులు చేయండని.. గతంలో అధికారులు ఇలాగే ఉండేవారని, మీరు కూడా అదే బాటలో నడవాలని కొందరు దళారులు మాయమాటలు చెప్పి నడిపించేవారని కింది స్థాయి అధికారులు కొందరు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో డబ్బులిస్తేనే పని అవుతుందని, చేయి తడపకపోతే వారికి కంప్యూటర్‌ పని చేయడంలేదు, సర్వర్‌ పనిచేయడంలేదంటూ ముప్పతిప్పలు పెట్టేవారని ప్రజలు వివరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు