చోరీ కేసులో నిందితుడు పరారీ | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడు పరారీ

Published Fri, Aug 31 2018 12:20 PM

Accused Escape From Police Headquarters Krishna - Sakshi

కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): భారీ చోరీకేసులో నిందితుడిని పోలీసులు అరెస్టుచేసి పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లో విచారణ చేపట్టారు. విచారణ చేస్తుండగానే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై జిల్లా ఎస్పీ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీం తో పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిందితుడి కోసం జల్లెడపట్టినట్లు సమాచారం. వివరాలివి..

సంచలనం సృష్టించిన చోరీ
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లికి చెందిన అంతర్‌ జిల్లా పాత నేరస్తుడు ఏడిత సత్యనారాయణ గత నెల 31న కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం పెదతుమ్మిడికి చెందిన బొల్లా శివాజీ ఇంట్లో అనకాపల్లికి చెందిన మరో ఇద్దరు అంతర్‌జిల్లా పాత నేరస్తులతో కలిసి భారీ చోరీకి పాల్పడ్డాడు. ఈ చోరీలో సుమారు రూ. 11 లక్షల నగదుతో పాటు శివాజీ తల్లి ఒంటిపై ఉన్న మరో రూ. 3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరించుకుపోయాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులు పెదతుమ్మిడి నుంచి ఉడాయించారు. ఈ కేసులో ఎట్టకేలకు సత్యనారాయణతో పాటు మిగిలిని ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దొరికిన నిందితులను వేర్వేరు స్టేషన్లలో ఉంచి విచా రణ నిర్వహిస్తున్నట్లు çసమాచారం.

దొరికినట్టే దొరికి..  
సత్యనారాయణను జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా హెడ్‌క్వార్టర్‌లోని ఓ గదిలో ఉంచి విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారిస్తుండగా ఈ నెల 30న సత్యనారాయణ పోలీసుల కళ్లుగప్పి జిల్లా హెడ్‌క్వార్టర్‌ కార్యాలయం నుంచి తప్పించుకుపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
పగలూ, రాత్రీ నిత్యం పోలీసు అధికారులు, సిబ్బంది రాకపోకలతో ఉండే జిల్లా హెడ్‌క్వార్టర్‌ నుంచి చోరీ కేసులో ప్రధాన నిందితుడైన సత్యనారాయణ ఉడాయించటం జిల్లాలో కలకలం రేపుతోంది.

గాలింపు ముమ్మరం
నిందితుడి కోసం పోలీసులు జిల్లాలో జల్లెడపడుతున్నట్లు సమాచారం. మరిన్ని ప్రత్యేక టీంలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకోగా అప్రమత్తమైన పోలీసులు జిల్లా హెడ్‌క్వార్టర్‌లోని ప్రతి కార్యాలయం సమీప ప్రాంతాల్లో జల్లెడపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంపై సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. నిందితుడు ఉడాయించిన సమయంలో డ్యూటీలో ఉన్న వారిపై శాఖాపరమైన చర్యలకు ఆయన ఉపక్రమించేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అంత భద్రత నడుమ పరారుకావడంపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు పరారయ్యాడా? లేక తప్పించారా? అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement