జవాన్‌ను చంపిన భార్య, డ్రైవర్‌.. | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే శత్రువు

Published Mon, Feb 24 2020 12:18 PM

Army Officer Murder Mystery Reveals in Karnataka - Sakshi

దేశం కోసం మంచుకొండల్లో, ఎడారుల్లో పహరా కాస్తూ జీవితం త్యాగం చేస్తున్న జవాన్‌కు ఇంట్లోనే శత్రువులు ఉన్నారని తెలియదు. భార్య ఆనందం కోసం ఆమెకు కారు, ఇల్లు సమకూర్చాడు. కానీ చివరకు ఇల్లాలే, ప్రియునితో కలిసి జవాన్‌నుపరలోకానికి పంపించింది. ఇప్పుడుఇద్దరూ కటకటాలు లెక్కిస్తున్నారు.

కర్ణాటక, యశవంతపుర: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటనలో పోలీసులు ఓ మహిళతో ఆమె ప్రియుడిని అరెస్ట్‌ చేసిన ఘటన బెళగావిలో జరిగింది. హతుడు ఆర్మీ జవాన్‌ కాగా, నిందితులు అతని భార్య, కారు డ్రైవర్‌ కావడం గమనార్హం. వివరాలు... బెళగావి తాలూకా మారిహలకు చెందిన దీపక్‌ పట్టణధార్‌ (32) 14 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అంజలితో పెళ్లయింది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. దీపక్‌ ఆరు నెలలకు ఒకసారి సొంతూరు బెళగావికి వచ్చి వారం రోజుల పాటు ఉండి వెళ్లేవాడు. తాలూకాలోని హోన్నిహళ గ్రామంలో ఇంటి స్థలం కొని ఇల్లు కట్టిచాడు. ఆమెకు కారును కొనిచ్చి ప్రశాంత్‌ అనే యువకున్ని డ్రైవర్‌ను నియమించాడు. దీపక్‌ దేశ రక్షణలో నిమగ్నమై ఉండగా, అంజలి, డ్రైవర్‌ ప్రశాంత్‌ మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.  

రిటైరవుతానని చెప్పడంతో  
అంజలి, డ్రైవర్‌ మధ్య గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుస్తోంది. దీపక్‌ జనవరి మూడో వారంలో సెలవు పెట్టి వచ్చాడు. ఆర్మీలో రిటైర్మెంట్‌ తీసుకుని కర్ణాటక పోలీసుశాఖలో చేరాలని నిర్ణయించాడు. ఇది భార్యకు నచ్చలేదు. భర్త ఊరిలో ఉంటే తమ ఆటలు సాగవని భావించింది. సమస్య తీరాలంటే భర్త దీపక్‌ను అడ్డు తొలగించుకోవడం ఒక్కటే మార్గమని ప్రేయసీ ప్రియుడు తీర్మానించుకున్నారు. 

గోకాక్‌కు తీసుకెళ్లి, మద్యం తాపి  
భర్తను జనవరి 28న గోకాక్‌ గోడచనమల్లి జలపాతానికి కారులో తీసుకెళ్లారు. మధ్యలో అంజలి ఒత్తిడి చేసి భర్త చేత మద్యం బాగా తాగించింది. పథకం ప్రకారం ప్రశాంత్‌ స్నేహితులు ముందుగానే జలపాతం వద్దకు వచ్చారు. అంజలి మత్తులో ఉన్న దీపక్‌ను గొంతు పిసికి కారులోనే హత్య చేయించింది. అనంతరం డ్రైవర్‌ ప్రశాంత్‌ స్నేహితులు నవీన్‌ కెంగేరి, ప్రవీణ్‌లు జవాన్‌ మృతదేహాన్ని జలపాతంలోకి తోసేశారు. 

భర్త మిస్సింగ్‌ అని హంగామా
నాలుగు రోజుల తరువాత తన భర్త  కనిపించటంలేదంటూ ఫిబ్రవరి 4న అంజలి మారిహళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా çపోలీసులు పట్టించుకోవటంలేదని పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా కూడా చేసింది.  
కేసును నమోదు చేసుకున్న పోలీసులు జవాన్‌ మొబైల్‌ నంబర్‌ ఆధారంగా జలపాతం పరిసరాల్లో గాలించగా  కుళ్లిన స్థితిలో పక్షులు, చేపలు తిని మిగిలిన శవం కనిపించింది. దీంతో దర్యాప్తు చేపట్టారు. హత్యకు ముందు, తరువాత డ్రైవర్‌ ప్రశాంత్‌ మొబైల్‌ఫోన్‌ లొకేషన్, అంజలి ఫోన్‌కాల్స్‌ ఆధారంగా ఇద్దరిపై అనుమానం వచ్చింది. ఇద్దరినీ తమదైన శైలిలో విచారించగా అంజలి–ప్రశాంత్‌లు చేసిన నేరం బయట పడింది. దీంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. నవీన్‌ కెంగేరి, ప్రవీణ్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement