బెదిరించడం.. దోచుకెళ్లడం | Sakshi
Sakshi News home page

బెదిరించడం.. దోచుకెళ్లడం

Published Fri, Jul 26 2019 8:30 AM

Arrest Of Two Burglars Who Are Chainsnatching - Sakshi

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): వారిద్దరూ దొంగలు.. ఒంటరిగా వెళ్లేవారిని బెదిరించి నగలు దోచుకెళ్లడం.. చైన్‌స్నాచింగ్‌లు చేయడంలో సిద్ధహస్తులు. వారి కదలికలపై నిఘా ఉంచిన నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.5 లక్షలు విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి గురువారం నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్ల డించారు. కొత్తూరు మల్లయ్యగుంటకు చెందిన జి.శ్రీనివాసులురెడ్డి అలియాస్‌ శ్రీను, చంద్రమౌళినగర్‌కు చెందిన పి.గవాస్కర్‌లు స్నేహితులు. వ్యసనాలకు బానిసైన వీరు దొంగలుగా మారారు. జట్టుగా ఏర్పడి జాతీయ రహదారి వెంబడి, నిర్మానుష్య ప్రదేశాల్లో మాటువేసి అటుగా వచ్చేవారిని బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకునేవారు. గొలుసు దొంగతనాలకు పాల్ప డుతున్నారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుపాలైయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం తిరిగి యథేచ్ఛగా నేరాలకు పాల్ప డుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగారు. 

జాతీయ రహదారిపై దోపిడీ 
ఈనెల 18వ తేదీన నెల్లూరులోని సుందర్యకాలనీ జాతీయ రహదారి సమీపంలో జ్యోతినగర్‌కు చెందిన అహ్మద్‌ అనే వ్యక్తి తన తల్లికి చెందిన రెండు బంగారుగాజులు తీసుకెళుతున్నాడు. ఈ సమయంలో వారిద్దరూ అతనిపై దాడిచేసి గాజులు అపహరించారు. ఈ ఘటనపై వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు  ఆధ్వర్యంలో ఎస్సైలు   ఎ.సుధాకర్, లక్ష్మణ్, పుల్లారెడ్డిలు తమ సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 24వ తేదీ సాయంత్రం నిందితులు వేదాయపాళెం నుంచి గాంధీనగర్‌ వెళ్లే కూడలి వద్ద ఉన్నారన్న సమాచారం అందుక్ను ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి దాడిచేసి వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

సిబ్బందికి అభినందన 
నిందితులను అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సైలు ఎ.సుధాకర్, లక్ష్మణ్, పుల్లారెడ్డి, ఏఎస్సై ప్రసాద్, హెడ్‌ కానిస్టేబుల్‌ సుధాకర్, జిలానీ, కానిస్టేబుల్‌ గోపాల్‌ తదితరులను డీఎస్పీ అభినందించారు. త్వరలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

వెలుగులోకి పలు నేరాలు 
పోలీసులు శ్రీను, గవాస్కర్‌లను విచారించగా హైవేపై గాజుల దోపిడీతోపాటు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రవీంద్రనగర్‌లో, డైకస్‌రోడ్డు సమీపంలో, చంద్రమౌళి నగర్, కొండాయపాళెం చంద్రిక నగర్‌లో, దర్గామిట్ట పోలీసుస్టేషన్‌ పరిధిలోని కొండాయపాళెం సెంటర్‌ వద్ద, బాలాజీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లుగా వెల్ల డించారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువచేసే 26 సవర్ల బంగారు ఆభరణాలను, రెండు మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల్లో శ్రీనుపై వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్టెడ్‌ షీటు ఉందని తెలిపారు. గతంలో నిందితులు నకిలీ పోలీసుల అవతారం ఎత్తి ఒంటరిగా వెళ్లే జంటలను బెదిరించి దోపిడీకి పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకి వెళ్లినట్లు తెలియజేశారు.  

Advertisement
Advertisement