పడగొట్టలేకపోయారు!

15 Dec, 2018 00:38 IST|Sakshi

తొలి రోజు ఫలించని పేస్‌ మంత్రం

ఆస్ట్రేలియా 277/6

హారిస్, హెడ్, ఫించ్‌ అర్ధసెంచరీలు

 రెండు కీలక వికెట్లు తీసిన విహారి 

 పేస్‌కు బాగా అనుకూలమైన పిచ్‌... ఫాస్ట్‌ బౌలర్లకు స్వర్గధామం... బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు... రెండో టెస్టు ఆరంభానికి ముందు బాగా వినిపించిన మాటలు ఇవి. కానీ ఆస్ట్రేలియా ఈ ప్రతికూలతలన్నింటినీ సమర్థంగా అధిగమించింది. అప్పుడప్పుడు కొన్ని బంతులు అనూహ్యంగా దూసుకొచ్చినా మొత్తంగా పెద్దగా భయపెట్టే పిచ్‌ ఏమీ కాదని తేలిపోయింది. వంద పరుగులు దాటాక కానీ భారత్‌ తొలి వికెట్‌ను తీయలేకపోయింది. ఆసీస్‌ పట్టుదలకు తోడు మన నలుగురు పేసర్ల దళం ఆశించిన స్థాయిలో చెలరేగకపోవడంతో ఆతిథ్య జట్టు మెరుగైన స్కోరు నమోదు చేసింది. పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ హనుమ విహారి రెండు కీలక వికెట్లు తీయగా... నలుగురు ఫాస్ట్‌బౌలర్లు కలిసి నాలుగు వికెట్లే పడగొట్టగలిగారు. ఫలితంగా ఒక దశలో భారత్‌కు పట్టు చిక్కినట్లే కనిపించిన ఆటలో చివరకు తొలి రోజు కంగారూల వశమైంది.   

పెర్త్‌: తొలి టెస్టులో భారత్‌ చేతిలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా రెండో టెస్టును ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. హారిస్‌ (141 బంతుల్లో 70; 10 ఫోర్లు), టిమ్‌ హెడ్‌ (80 బంతుల్లో 58; 6 ఫోర్లు), ఆరోన్‌ ఫించ్‌ (105 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. హారిస్, ఫించ్‌ తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించగా, హెడ్, షాన్‌ మార్‌‡్ష (45) ఐదో వికెట్‌కు 84 పరుగులు జత చేశారు. ఇషాంత్‌ (2/35), విహారి (2/53)లకు చెరో 2 వికెట్లు దక్కగా... బుమ్రా, ఉమేశ్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ప్రస్తుతం పైన్‌ (16 బ్యాటింగ్‌), కమిన్స్‌ (11బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.  

భారీ భాగస్వామ్యం... 
గత టెస్టులో తొలి ఓవర్లోనే వికెట్‌ చేజార్చుకున్న ఆస్ట్రేలియాకు ఈసారి ఓపెనర్లు పటిష్టమైన పునాది వేశారు. హారిస్, ఫించ్‌ కలిసి ఎలాంటి తడబాటు లేకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆరంభంలో కొంత పేస్, స్వింగ్‌కు పిచ్‌ అనుకూలించినా భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇషాంత్‌ ఓవర్లో మూడు ఫోర్లు బాది దూకుడు కనబర్చిన హారిస్‌... ఆ తర్వాత ఉమేశ్‌ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. ‘నో బాల్‌’లు వేయకుండా ఇషాంత్‌ అతి జాగ్రత్తకు పోవడంతో అతని బౌలింగ్‌లో పదును లోపించింది. ఫించ్‌ 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో భారత్‌ ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ చేసినా ఫలితం ప్రతికూలంగా వచ్చింది. లంచ్‌ సమయానికి ఆసీస్‌ స్కోరు 66 పరుగులకు చేరింది. లంచ్‌ తర్వాత షమీ వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన హారిస్‌ 90 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చూస్తుండగానే వీరిద్దరి భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. విహారి వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఫించ్‌ కూడా 103 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  

ఆస్ట్రేలియా 36/4... 
కంగారూల జోరుకు ఈ దశలో బ్రేక్‌ పడింది. ఎట్టకేలకు ఫించ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని బుమ్రా భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు.  బుమ్రా బౌలింగ్‌లో దెబ్బలు తగిలించుకొని చచ్చీ చెడి ఒక్కో బంతిని ఎదుర్కొన్న ఉస్మాన్‌ ఖాజా (38 బంతుల్లో 5)ను ఉమేశ్‌ వెనక్కి పంపించాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్‌ బౌలింగ్‌ చేసేందుకు వచ్చిన విహారి కీలక వికెట్‌తో ఆసీస్‌ను దెబ్బ తీశాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న హారిస్‌ అనూహ్యంగా ఎగసిన బంతిని ఆడబోయి స్లిప్‌లో రహానేకు క్యాచ్‌ ఇచ్చాడు. టీ విరామం తర్వాత కోహ్లి అద్భుత క్యాచ్‌కు హ్యాండ్స్‌కోంబ్‌ (7) పెవిలియన్‌ చేరాడు. 36 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు పడగొట్టిన భారత్‌ ఒక్కసారిగా పైచేయి సాధించింది.  

ఆదుకున్నమార్‌ష, హెడ్‌...  
ఈ దశలో ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ షాన్‌ మార్‌ష, టిమ్‌ హెడ్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను మళ్లీ దారిలోకి తెచ్చారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేయడంతో భాగస్వామ్యం చకచకా 50 పరుగులు దాటింది. పార్ట్‌టైమర్‌ విజయ్‌తో ఒక ఓవర్‌ ప్రయత్నించగా మార్‌ష రెండు ఫోర్లు కొట్టాడు.  ఇలాంటి స్థితిలో విహారి మళ్లీ ఆసీస్‌ను దెబ్బ తీయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. మరోసారి విహారి బంతిని కట్‌ చేయబోయిన మార్‌ష స్లిప్‌లో రహానే చక్కటి క్యాచ్‌కు ఔటయ్యాడు. మరోవైపు 70 బంతుల్లో హెడ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అయితే కొత్త బంతి తీసుకున్న తర్వాత రెండో ఓవర్లోనే ఇషాంత్‌ బౌలింగ్‌లో షమీకి క్యాచ్‌ ఇచ్చిన హెడ్‌ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో వికెట్‌ పడకుండా పైన్, కమిన్స్‌ ఆట ముగించారు.  

85 సెకన్లలో ఓవర్‌ పూర్తి! 
పెర్త్‌లో మొదటి రోజు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో భారత ఆటగాళ్లకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ముఖ్యంగా నలుగురు పేసర్లు బాగా శ్రమించాల్సి వచ్చింది. దీనికి తోడు ఓవర్‌రేట్‌ను కూడా కాపాడుకోవాల్సి రావడంతో హనుమ విహారితో ఎక్కువ ఓవర్లు వేయించారు. చకచకా బౌలింగ్‌ చేసే రవీంద్ర జడేజాను గుర్తు చేసే విధంగా ఒక ఓవర్‌ను విహారి కేవలం 1 నిమిషం 25 సెకన్లలో ముగించడం విశేషం. ఈ వేగం కారణంగానే భారత్‌ తొలి రోజు పూర్తిగా 90 ఓవర్లు వేయగలిగింది. 

ఆ రెండు క్యాచ్‌లు... 
తొలి రోజు భారత్‌ రెండు క్యాచ్‌లు వదిలేసి ఆసీస్‌ను సహకరించింది. హారిస్‌ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు షమీ ఓవర్లో స్లిప్‌లో రాహుల్‌ కొంత కష్టసాధ్యమైన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత విహారి బౌలింగ్‌లో మార్‌ష (24 వద్ద) ఇచ్చి న సునాయాస క్యాచ్‌ను కీపర్‌ పంత్‌ పట్టలేకపోయాడు. వీటి వల్ల భారత్‌కు భారీ నష్టం జరగకపోయినా... హారిస్‌ తన స్కోరు అదనంగా 10 పరుగులు, మార్‌ష మరో 21 పరుగులు జత చేయగలిగాడు.  

స్కోరు వివరాలు 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: హారిస్‌ (సి) రహానే (బి) విహారి 70; ఫించ్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 50; ఖాజా (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 5; షాన్‌ మార్‌‡్ష (సి) రహానే (బి) విహారి 45; హ్యాండ్స్‌కోంబ్‌ (బి) కోహ్లి (బి) ఇషాంత్‌ 7; హెడ్‌ (సి) షమీ (బి) ఇషాంత్‌ 58; పైన్‌ (బ్యాటింగ్‌) 16; కమిన్స్‌ (బ్యాటింగ్‌) 11; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (90 ఓవర్లలో 6 వికెట్లకు) 277. 
వికెట్ల పతనం: 1–112; 2–130; 3–134; 4–148; 5–232; 6–251. 
బౌలింగ్‌: ఇషాంత్‌ 16–7–35–2; బుమ్రా 22–8–41–1; ఉమేశ్‌ 18–2–68–1; షమీ 19–3–63–0; హనుమ విహారి 14–1–53–2; విజయ్‌ 1–0–10–0.   

మరిన్ని వార్తలు