బతుకు జీవుడా.. | Sakshi
Sakshi News home page

బతుకు జీవుడా..

Published Thu, Dec 6 2018 7:17 AM

Bolero Accident in Vizianagaram - Sakshi

విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: వారంతా గిరిశిఖర గ్రామాల్లో నివశించే గిరిజనులు. పండించిన ఫలసాయాలు, సేకరించిన అటవీ ఉత్పత్తులను మైదాన ప్రాంతంలో జరిగిన సంతలో విక్రయించి..  వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి గ్రామాలకు తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో వాహనంలో వస్తుండగా బ్రేకులు ఫెయిలై బోల్తాపడడంతో 20 మంది గాయపడగా... ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే... గుమ్మలక్ష్మీపురం మండలంలోని తోట, గోరటి గ్రామాలకు చెందిన గిరిజనులు గుమ్మలక్ష్మీపురంలో బుధవారం జరిగిన సంతకు వెళ్లి అటవీ ఉత్పత్తులు విక్రయించి తమకు కావాల్సిన సరకులు కొనుగోలు చేశారు. తిరిగి స్వగ్రామాలకు వెళ్లేందుకు పెదఖర్జ గ్రామానికి చెందిన పాండుసాహు మురళికి చెందిన బొలేరో పికప్‌ ( ఏపీ 35వై 3745)  వాహనం ఎక్కారు. సరిగ్గా పెదఖర్జ పంచాయతీ చప్పగూడ గ్రామం దాటిన తర్వాత ఘాట్‌రోడ్డు నాలుగో మలుపు వద్ద వాహనం బ్రేకులు ఫెయిలయ్యాయి.

దీంతో వాహనం వెనక్కి వెళ్లిపోతుండడంతో గిరిజనులు హాహాకారాలు చేశారు. పది మీటర్ల వరకు వెనక్కి వచ్చిన వాహనం బోల్తా పడి ఓ రాయిని ఆనుకుని నిలిచింది. వెంటనే ప్రయాణికులు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో తోట గ్రామానికి చెందిన బిడ్డిక లచ్యయ్య, బిడ్డిక రామారావు, మండంగి గీత, బిడ్డిక ఇందు, బిడ్డిక చిన్నమ్మి, నిమ్మక లుద్దు, బిడ్డిక జిన్న,  నిమ్మక వీర, బిడ్డిక పద్మావతి.. గోరటి గ్రామానికి చెందిన బిడ్డిక గణపతి, మండంగి దివ్య, నిమ్మక శ్రీరాం, తోయక దమయంతి, బిడ్డిక ప్రసాద్, బిడ్డిక సాంతమ్మ, బిడ్డిక కుద్ద, తోయక మహేష్, తదితర 20 మంది గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు ఎల్విన్‌పేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బమ్మిడి శ్రీనివాసరావుతో పాటు ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షత్రగాత్రులను హుటాహుటిన భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించిన తర్వాత తీవ్రంగా గాయపడిన  బిడ్డిక లచ్చయ్య, బిడ్డిక రామారావు, మండంగి గీతలను మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.  ఎల్విన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెను ప్రమాదమే తప్పింది.
గోరటి ఘాట్‌రోడ్డులో బొలేరో పికప్‌ వాహనం బోల్తాపడి రోడ్డు అంచున గల రాయిని తాకుతూ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రాయి అడ్డులేకపోతే సుమారు 300 అడుగుల లోతులో ఉన్న లోయలో వాహనం పడిపోయేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘాట్‌రోడ్డు కావడంతో ఆర్టీసీ బస్సులు వెళ్లకపోవడంతో గిరిజనులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదు.   గతేడాది డిసెంబర్‌ 8న కూడా ఇదే స్థలంలో బ్రేకులు ఫెయిలై ఆటో లోయలో పడిపోవడంతో పార్వతీపురానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. 

Advertisement
Advertisement