ఉసురు తీసిన ఇసుక గుంతలు | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన ఇసుక గుంతలు

Published Thu, May 2 2019 12:18 PM

Boy Died in Sharadha River Visakhapatnam - Sakshi

యలమంచిలి రూరల్‌:  శారదా నదిలో ఇసుక అక్రమ తవ్వకందారులు తీసిన గుంతలు అన్యంపుణ్యం ఎరుగని ఓ బాలుడి ఉసురు తీశాయి. అక్రమార్కుల ‘పైసా’చకత్వానికి ఆ చిన్నారి బలయ్యాడు. డబ్బు పిచ్చిపట్టిన వారి దురాశ కారణంగా  మతిస్థితిమితం లేని ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

  మండలంలోని జంపపాలెం గ్రామానికి చెందిన దూది రమణ అనే వ్యక్తి ప్రైవేట్‌ విద్యుత్‌ కార్మికునిగా పనిచేస్తున్నాడు. రమణ, లక్ష్మి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.   కుమారుడు యశ్వంత్‌ (8)కు మతిస్థిమితం లేకపోవడంతో అత్యంత గారాభంగా చూసుకుంటున్నారు. స్థానిక  పాఠశాలలో యశ్వంత్‌ రెండో తరగతి చదువుతున్నాడు. బుధవారం తోటి పిల్లలతో ఆడుకుంటూ శారదానది వద్దకు వెళ్లాడు. ఆడుతూ యశ్వంత్‌ శారదానదిలోని నీటిగుంటలో పడి  ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. తోటి పిల్లలు ఈ విషయాన్ని యశ్వంత్‌ తల్లిదండ్రులకు తెలిజేశారు. గ్రామానికి చెందిన ఈతగాళ్లు గంటసేపు నదిలో గాలించి, యశ్వంత్‌ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.  వారు  ఘటనాస్థలికి చేరుకునేలోపే య«శ్వంత్‌ మృతిచెందినట్టు గుర్తించారు.  శారదా నదిలో అక్రమ ఇసుక తవ్వకం దారులు పొక్లెయిన్లతో తవ్విన గోతులలో నిల్వ ఉన్న నీటిలో పడి బాలుడు మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.

బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.   కుమారుని మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. గ్రామస్తులంతా  బాలుని ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు.  యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ సంతోష్‌ గ్రామానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement