డెంగీతో ఇద్దరి మృతి

2 Nov, 2019 09:16 IST|Sakshi
మృతి చెందిన చంద్రకళ

సాక్షి, పాలసముద్రం(చిత్తూరు): కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక‍్కాల్సిన ఓ యువతిని డెంగీ జ్వరం బలితీసుకుంది. మూడుముళ్ల బంధంతో నూరేళ్లు సంసార జీవితాన్ని గడిపేందుకు సిద్ధమవాల్సిన వేళ...పెళ్లికూతురిని డెంగీ జ్వరం కబళించింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌పురం గ్రామానికి చెందిన కృష్ణంరాజు, రెడ్డెమ్మల కుమార్తె చంద్రకళ అలియాస్‌ కావ్య (18) గత నెల 30న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆమెకు డెంగీ సోకింది. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం తమిళనాడులోని షోళింగర్‌ ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి వేలూరులోని అడుకుంబారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

మరోవైపు బంధుమిత్రులు, గ్రామస్థులు బుధవారం పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఎలాగైనా ఆసుపత్రి నుంచి వధువును తీసుకొచ్చి తాళి కట్టించాలని పెద్దలు ప్రయత్నించారు. పరిస్థితి బాగా లేనందున వైద్యులు నిరాకరించడంతో పెళ్లి ఆగింది. శుక్రవారం ఆమె మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన కుమార్తెను శ్మశానానికి పంపించాల్సి వచ్చిందంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే అధికారులు మాత్రం అది డెంగీ కాదని జ్వరం కారణంగా చనిపోయిందని చెబుతున్నారు.

బాలుడిని మింగిన డెంగీ
మదనపల్లె టౌన్‌: డెంగీతో బాలుడు మృతి చెందిన సం ఘటన శుక్రవారం మదనపల్లెలో వెలుగుచూసింది.  కుటుంబ సభ్యుల కథనం మేరకు, పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉంటున్న మణికంఠరెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డి (5) మూడు రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా జ్వరం తగ్గలేదు. గురువారం నుంచి జ్వరం తీవ్రం కావడంతోపాటు కడుపు నొప్పితో వాంతులు, విరేచనాలు చేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. కన్నుమూసిన బిడ్డను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.     

మరిన్ని వార్తలు