పరారీలో టీడీపీ నేత కూన రవికుమార్ | Sakshi
Sakshi News home page

కూన రవికుమార్‌పై కేసు నమోదు

Published Mon, May 25 2020 8:25 AM

Case Filed Against TDP Leader Kuna Ravi Kumar - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: పొందూరు తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత కూన రవికుమార్‌పై కేసు నమోదయ్యింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం అరెస్ట్‌ చేసేందుకు రవికుమార్‌ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రే ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్‌ రామకృష్ణను టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరించారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్‌ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్‌ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్‌ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్‌ చేశారు. దీంతో రవికుమార్‌ తహసీల్దార్‌కు ఫోన్‌చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్‌ చేశావని నీ మీద కంప్లైంట్‌ చేస్తాను’ అని ‘కూన’ బెదిరించారు. ‘నా చేతిలో ఏం లేదు. సీజ్‌ చేసి అప్పగించేశాను’ అని తహసీల్దార్‌ చెప్పడంతో.. ‘కూన’ దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్‌ చేశావుగానీ కంప్లైంట్‌ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.

కూన రవికుమార్‌పై  రౌడీషీట్ ఓపెన్ చేయాలి
కూన రవికుమార్‌ది రాక్షసతత్వం అని పొందూరు తహసీల్ధార్‌ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రభుత్వ అధికారులంటే చులకన అని,ప్రభుత్వ అధికారులను దూషించడం ఆయనకు అలవాటు అని మండిపడ్డారు. గతంలో కూడా ఆయన చాలాసార్లు నన్ను దుర్భాషలాడారని పేర్కొన్నారు. పాతేస్తానని రవికుమార్‌ తనను బెదిరించారని తెలిపారు. ఆఫీసులోకి చొరబడి దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. ఆయన అనుచరులు తన కారును వెంబడించి బెదిరింపులకు దిగారని రామకృష్ణ తెలిపారు. టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశాయి

Advertisement

తప్పక చదవండి

Advertisement