ఉన్నావ్‌ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఉన్నావ్‌ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌

Published Sat, Apr 14 2018 2:48 AM

CBI arrests BJP MLA Kuldeep Singh Sengar - Sakshi

న్యూఢిల్లీ / అలహాబాద్‌ / చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కఠువా, ఉన్నావ్‌ గ్యాంగ్‌రేప్‌ కేసుల్లో కదలిక వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి(17)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ను సీబీఐ అధికారులు  శుక్ర వారం అరెస్టు చేశారు. అలాగే పోలీసులు నమోదుచేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ అధికారులు రీరిజిస్టర్‌ చేశారు. 

మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో మైనర్‌ బాలిక అసిఫా(8) హత్యాచారం కేసును సుప్రీంకోర్టు శుక్రవారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. చార్జ్‌షీట్‌ను దాఖలుచేయడానికి యత్నించిన పోలీసుల్ని న్యాయవాదులు అడ్డుకోవడంపై బార్‌ కౌన్సిళ్లకు నోటీసులు జారీచేసింది. అసిఫా కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాదికి బెదిరింపులు రావడాన్ని ఈ సందర్భంగా కొందరు లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలాఉండగా కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ మంత్రులు చందర్‌ ప్రకాశ్, లాల్‌ సింగ్‌ తమ పదవులకు రాజీనామా చేశారు.

ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసిన సీబీఐ
ఉన్నావ్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ను తొలుత విచారణ నిమిత్తం శుక్రవారం అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు సాయంత్రానికి అరెస్ట్‌ చేశారు. కుల్దీప్‌ను ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉన్నావ్‌ ఘటనలో దోషులు ఎంతవారైనా వదిలిపెట్టబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్‌ను ఏర్పాటుచేశామన్నారు.

‘కుల్దీప్‌ను వెంటనే అరెస్ట్‌ చేయండి’
ఉన్నావ్‌ ఘటనలో ప్రధాన నిందితుడు కుల్దీప్‌ సింగ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని అంతకుముందు అలహాబాద్‌ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. కుల్దీప్‌ను సీబీఐ ప్రస్తుతం విచారిస్తోందని న్యాయవాది కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి డీబీ భోసలే, జస్టిస్‌ సునీత్‌ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. నిందితుడు  బాధితులతో పాటు విచారణను ప్రభావితం చేయొచ్చనీ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని వ్యాఖ్యానించింది. విచారణపై నివేదికను మే2 లోగా సమర్పించాలని ఆదేశించింది.

బార్‌ కౌన్సిళ్ల తీరుపై సుప్రీం ఆగ్రహం:
కఠువా కేసులో పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలుచేయకుండా న్యాయవాదులే అడ్డుకోవడంపై సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎంఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విచారణ ప్రక్రియలో జోక్యం వల్ల బాధితులకు న్యాయం అందడం ఆలస్యమవుతుందని వ్యాఖ్యానించింది. బాధితులు, నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాదుల్ని అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ విషయంలో లాయర్ల ప్రవర్తనపై తమ స్పందనల్ని ఏప్రిల్‌ 19లోగా తెలియజేయాలని కఠువా జిల్లా బార్‌ అసోసియేషన్, జమ్మూకశ్మీర్‌ బార్‌ కౌన్సిల్, జమ్మూహైకోర్టు బార్‌ అసోసియేషన్, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.  ఈ  సందర్భంగా జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం తరఫున న్యాయవాది షోయబ్‌ ఆలమ్‌ వాదనలు వినిపిస్తూ.. పోలీసుల్ని అడ్డుకున్న న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్లు  వెల్లడించారు. కఠువా ఘటనలో మృతురాలి వివరాలు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది.

Advertisement
Advertisement