తండ్రి కాపాడుతాడని... | Sakshi
Sakshi News home page

తండ్రి కాపాడుతాడని...

Published Thu, Jul 5 2018 1:31 AM

CCTV Shows How Delhi Family Organised Hanging - Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయిన కేసు మరో మలుపు తిరిగింది. ఆత్మహత్య సందర్భంగా చనిపోయిన తండ్రి తమను కాపాడతాడని భాటియా కుటుంబం నమ్మేదని ఇంట్లో పోలీసులకు లభ్యమైన డైరీల్లో ఉంది. ఈ క్రతువులో భాగంగా ‘ఓ కప్పులో నీళ్లు ఉంచండి. అది రంగు మారగానే నేను వచ్చి మిమ్మల్ని కాపాడతాను’ అని లలిత్‌ భాటియా(45)తో ఆయన తండ్రి అన్నట్లు వీటిలో ఉంది. జూన్‌ 30న(శనివారం) చివరిసారిగా రాసిన డైరీలో ఈ క్రతువుల్ని ‘దేవుడి దగ్గరకు దారి’గా లలిత్‌ అభివర్ణించాడు. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తండ్రి తనకు కన్పిస్తున్నారనీ, ఆయన సూచనలతో మోక్షం కోసం ఈ క్రతువును పాటించినట్లు లలిత్‌ రాసుకున్నాడు.

మరోవైపు భాటియా కుటుంబం ఆత్మహత్యకు చేసుకుంటున్న ఏర్పాట్లు ఎదురింటివారు అమర్చిన సీసీటీవీలో నమోదయ్యాయి. దీన్ని ఓ జాతీయ మీడియా సంస్థ బుధవారం ప్రసారం చేసింది. తాంత్రిక క్రతువులో భాగంగా భాటియా కుటుంబం పెద్ద కొడలు సవిత, ఆమె కుమార్తె నీతూలు శనివారం రాత్రి 10 గంటలకు ఐదు కుర్చీలను ఇంట్లోకి తీసుకెళ్లినట్లు వీడియోలో ఉంది. మరో 15 నిమిషాలకు ఉరి వేసుకునేందుకు కావాల్సిన వైర్లను శివమ్‌(15), ధ్రువ్‌(12)లు తీసుకొచ్చారు. కాగా, ఈ దారుణం జరిగిన రోజున బయటివారెవరూ భాటియా ఇంట్లోకి వెళ్లలేదని పోలీసులు స్పష్టం చేశారు. బురారీ ఘటనలో చనిపోయిన శివమ్‌(15), ధ్రువ్‌(15) చదువులో ఎప్పుడూ చురుగ్గానే ఉండేవారని ఢిల్లీకి చెందిన వీరేంద్ర పబ్లిక్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడు తెలిపారు.

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సంఘటన జరిగిన తీరుతెన్ను ఇదే..
శనివారం రాత్రి 10 గంటలు: పెద్ద కోడలు సవిత, ఆమె కుమార్తె నీతూ ఆత్మహత్య కోసం కుర్చీలు తెచ్చారు.
► 10:15గంటలు–ధ్రువ్, శివమ్‌లు ఉరి కోసం వైర్లను తీసుకొచ్చారు.
► 10:39– ఆర్డర్‌ చేసిన 20 రొట్టెల్ని ఓ వ్యక్తి డెలివరీ చేశాడు
► 10:57– పెద్ద కుమారుడు భవనీశ్‌ ఇంట్లోని కుక్కను షికారుకు తీసుకెళ్లాడు.
► 11:04– కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చారు.

ఆదివారం ఉదయం
► 5.56 గంటలు– పాలవాడు క్యాన్లను ఇంటిదగ్గర పెట్టివెళ్లాడు.
► 7.14– పొరుగునే ఉన్న ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.

 

Advertisement
Advertisement