ఆధార్‌ అనుసంధానం పేరుతో మోసం | Sakshi
Sakshi News home page

ఆధార్‌ అనుసంధానం పేరుతో మోసం

Published Wed, Oct 4 2017 1:14 PM

Cheating with Aadhaar integration - Sakshi

అల్లిపురం(విశాఖ దక్షిణం): బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ అనుసంధానం పేరిట మోసానికి పాల్పడిన వ్యక్తిని సైబర్‌ క్రైం పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సైబర్‌ క్రైం సెల్‌ సీఐ వి.గోపీనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన సీతమ్మధార, పద్మావతి ఎన్‌క్లేవ్, జీ– 1లో నివసిస్తున్న లాల్‌ బహుదూర్‌ సిన్హాకు 09060876391 నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉద్యోగిని మాట్లాడుతున్నానని, మీ అకౌంట్‌కు ఆధార్‌ కార్డు నంబర్‌ అనుసంధానం చేయాలని, అందుకుగాను ఏటీఎం కార్డు నంబరు, సీవీవీ, ఓటీపీ వివరాలు చెప్పాలని కోరాడు. దీంతో అతను వివరాలు తెలియజేశాడు.

వివరాలు తెలుసుకున్న వ్యక్తి పేమెంట్‌ ఆన్‌లైన్‌ సర్వీసులు పోన్‌ పే యాప్, పేటీఎం ద్వారా రూ.70వేలు బదిలీ చేసేశాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు లాల్‌ బహుదూర్‌ సిన్హా ద్వా రకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో విచారణ చేపట్టిన సైబర్‌ క్రైం సీఐ వి.గోపినాథ్‌ నిందితుడు ఝా ర్ఖండ్‌ రాష్ట్రం, గిరిది జిల్లా, లోకియాకు చెందిన దినేష్‌ షాగా గుర్తించారు. అకౌంట్‌ నుంచి బదిలీ చేసుకున్న మొత్తంలో రూ.19999లు హర్యానా రాష్ట్రం, గురుగావ్‌లో తన ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు బదిలీ చేసుకున్నాడు. బ్యాం కు అకౌంట్‌కు అనుసంధానించిన కేవైసీ పత్రాల ద్వారా నిందితుడి వివరాలు తెలుసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement