టీడీపీ నేత మాయాజాలం! | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత మాయాజాలం!

Published Mon, Jun 3 2019 1:35 PM

Cheating Case Files on TDP Leader Krishna - Sakshi

వీరులపాడు (నందిగామ) : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆటో ఇప్పిస్తానని నమ్మబలికి యువకుడి వద్ద ఉన్న పత్రాలను తీసుకుని వాటితో టీడీపీ నాయకుడు ఇన్నోవా కారు పొందేందుకు యత్నించిన ఘటన ఇది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దాచవరం గ్రామానికి చెందిన కుర్రపాటి ఏసురత్నం లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడు నెలల క్రితం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆటో ఇప్పించాలని కోరుతూ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మల్నీడి మధు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఏసురత్నం పూర్తి వివరాలు తెలుసుకున్న మధు డ్రైవింగ్‌ లైసెన్స్, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్‌ కార్డు, చదువుకు సంబంధించి పత్రాలు తీసుకురావాలని చెప్పటంతో ఏసురత్నం అవి తీసుకొచ్చి ఇచ్చాడు.

చదువు లేకున్నా ఆటో ఇప్పిస్తానని హామీ..
మూడవ తరగతి వరకే చదువుకున్నానని ఏసురత్నం చెప్పటంతో అధికారులతో మాట్లాడి ఆటో ఇప్పిస్తానని మధు హామీ ఇచ్చి పంపాడు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి ఏపీ 39 ఎక్స్‌ 8355 నంబరుతో టయోటా ఇన్నోవా కారు మంజూరైందని ఏసురత్నంకు అధికారుల నుంచి ఉత్తర్వులు, ఫోన్‌ సందేశం వచ్చింది. దీంతో టీడీపీ నాయకుడి వద్దకు వెళ్లగా ఆటో మంజూరైందని, విజయవాడ వెళ్లాలని చెప్పి కారు షోరూంకు తీసుకెళ్లి అక్కడ కాగితాలపై సంతకాలు చేయించుకుని అక్కడి నుంచి పంపించేశాడు. దీంతో ఏమవుతుందో ఏమోనని భయపడిన ఏసురత్నం కారుకు తనకు సంబంధం లేదని షోరూం యజమానికి చెప్పేశాడు.

విచారించి చర్యలు తీసుకోవాలి..
ఈ విషయమై మరుసటి రోజు సదరు టీడీపీ నాయకుడి వద్దకు బాధితుడు వెళ్లాడు. తనకు కారు మంజూరైన విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. దీంతో సక్రమంగా వచ్చి కారు తీసుకుంటే మంచిదని, లేకుంటే నీ అంతు చూస్తానని బెదిరించాడు. తనకు చదువు లేదు, పదవ తరగతి పత్రాలు లేకుండా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కారు ఎలా మంజూరు చేశారో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్‌ఐ రామగణేష్‌ను వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులకు ఫోన్‌ చేసి సమాచారం సేకరించిన అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement