సహోద్యోగినికి సైబర్‌ వేధింపులు | Sakshi
Sakshi News home page

సహోద్యోగినికి సైబర్‌ వేధింపులు

Published Sat, Oct 28 2017 11:07 AM

colleague cyber harassment

సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్‌నెట్‌ ద్వారా ఖరీదు చేసిన అమెరికా నెంబర్‌ వినియోగించి సహోద్యోగినిని ఆన్‌లైన్‌ వేధింపులకు గురి చేసిన నిందితుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా అర్జునుడిపాలానికి చెందిన బి.వెంకట సత్యనారాయణరెడ్డి ప్రస్తుతం మాదాపూర్‌లో ఉంటూ ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఇదే హోటల్‌లో ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన ఓ యువతి సైతం పని చేశారు.

ఆమెకు పెళ్లికుదరడంతో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆమెపై అసక్తి పెంచుకున్న సత్యనారాయణ పెళ్లి చెడగొట్టాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఇంటర్‌నెట్‌ ద్వారా అమెరికాకు చెందిన ఓ సిమ్‌కార్డు ఖరీదు చేశాడు. దీనిని వైఫై ద్వారా వినియోగిస్తూ వాట్సాప్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాడు. బాధితురాలి ఫోన్‌లో ఉన్న ఆమె ఫొటోలు, కాబోయే భర్త నెంబర్‌ సేకరించిన అతను అభ్యంతరకరమైన వ్యాఖ్యలు జోడిస్తూ సహోద్యోగులతో పాటు  కాబోయే భర్తకూ పంపాడు. అతని వేధింపులు తాళలేక బాధితురాలు ఉద్యోగం సైతం మానుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సత్యనారాయణ నిందితుడిగా గుర్తించి శుక్రవారం అతడు పని చేస్తున్న హోటల్‌లోనే అరెస్టు చేశారు.

Advertisement
Advertisement