సాయం చేస్తున్నట్టు నటిస్తూ.. పిస్టల్‌తో కాల్పులు | Sakshi
Sakshi News home page

సాయం చేస్తున్నట్టు నటిస్తూ.. పిస్టల్‌తో కాల్పులు

Published Fri, Jun 15 2018 5:35 PM

Cops Release Photo Of 4th Suspect In Journalist Shujaat Bukhari Killing - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌, రైజింగ్‌ కశ్మీర్‌ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్‌ సయ్యద్‌ షుజాత్‌ బుఖారి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్న పోలీసులు, నాలుగో నిందితుడిని గుర్తించారు. నాలుగో నిందితుడి ఫోటోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అనుమానితుల ఫోటోలను పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాల్పులు జరిగాక, ఆయన బాడీ గార్డును కారు నుంచి పక్కకు తీసి, బుఖారికి సాయం చేస్తున్నట్టు నటిస్తూ.. మరోసారి పిస్టల్‌తో కాల్పులు జరిపినట్టు తెలిసింది. పిస్టల్‌తో కాల్చిన అనంతరం వెంటనే ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతను తెల్లని కుర్తా ధరించి, గడ్డెంతో ఉన్నాడని పోలీసులు తెలిపారు.   

అనుమానితుల ఫొటోలను విడుదల చేయడం ద్వారా స్థానికుల సాయంతో వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నేరస్తులకు సంబంధించిన సమాచారం అందించిన పౌరుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. మాస్కులు ధరించిన వీరు, గురువారం బుఖారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనలో బుఖారితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరొక సిబ్బందిని ఆస్పత్రికి తరలించగా.. ఆయన కూడా మరణించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ పౌరుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.  గురువారం సాయంత్రం ఇఫ్తార్‌ విందుకు వెళ్లేందుకు ఆఫీసు నుంచి బయటికి వచ్చాక బుఖారిపై దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు.  

బుఖారి అంత్య క్రియలు నేడు ఆయన పూర్వీకుల గ్రామం బారాముల్లాలోని క్రీరిలో జరిగాయి. జోరుగా వర్షం పడుతున్నప్పటికీ, స్నేహితులు, కొలీగ్స్‌, ఆ గ్రామ వాసులు పెద్ద ఎత్తున్న ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

Advertisement
Advertisement