Sakshi News home page

దంపతులను కబళించిన కరెంట్‌ 

Published Wed, Jun 6 2018 10:57 AM

Couple Died Due To Electric Shock In Peddapalli - Sakshi

గోదావరిఖని(రామగుండం) : కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నిరుపేద దంపతులను కరెంట్‌ కబళించింది. బట్టలు ఆరేస్తున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. భర్తను కాపాడబోయిన భార్య కూడా ఈ ఘటనలో మృత్యువాత పడడం విషాదాన్ని నింపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొము రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తాండూర్‌ ప్రాంతానికి చెందిన బొల్లం రమేష్‌ (45), సరోజన (38) దంపతులు బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం గోదావరిఖనికి వలస వచ్చారు. స్థానిక ప్రశాంత్‌నగర్‌లో గుడిసె వేసుకుని మేదరి కులవృత్తి చేస్తూ బుట్టలు, తడకలు, ఇతర వెదురు సంబంధిత వస్తువులు తయారు చేస్తూ మార్కెట్లో విక్రయించేవారు.

వీరి కి కూతురు అఖిల కాగా ఆమె ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇంట్లో స్నానం చేసిన రమేష్‌ తడి తువ్వాలను ఇంట్లో బట్టలు ఆరేసే ఇనుప తీగతో కూడిన దండెంపై ఆరవేయగా ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌కు గురై గట్టిగా అరుస్తూ కింద పడ్డాడు. ఇంట్లో పనిచేసుకుంటున్న భార్య సరోజన బయటకు వచ్చి అచేతనంగా పడిన భర్తను లేపే ప్రయత్నం చేయగా ఆమెకూ ఇనుప తీగ తగిలి కరెంట్‌ షాక్‌కు గురైంది. ఈ ఘటనను చూసిన వీరి కూతురు అఖిల వారిని పక్కకు జరిపేందుకు ప్రయత్నించగా ఆమెకూ షాక్‌ తగిలి ఒక్కసారిగా జల్లుమంది. దీంతో భయపడిన అఖి ల ఇంటి బయ టకు వచ్చి చుట్టు పక్కల వారికి విషయం తెలిపింది. వారు వచ్చి చూడగా భార్యభర్తలిద్దరు మృతి చెంది కనిపించారు.  

నెల రోజుల క్రితమే అద్దె ఇంట్లోకి... 
ప్రశాంత్‌నగర్‌లోని ఓ గుడిసెలో నివాసముండే రమేష్, సరోజన దంపతులు వర్షాకాలమైతే ఇళ్లు కురుస్తుందని సమీపంలోనే నెల రోజుల క్రితం అద్దె ఇంట్లోకి మారారు. అద్దె ఇంటిలో మీటర్‌కు వచ్చే సర్వీస్‌ వైరు పాతది కావడం, దాని పొర లేచి ఇనుప పైపులకు తీగలు కలవడంతో విద్యుత్‌ ఆ పైపులకు ప్రసారమైందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పైపులకు కట్టిన ఇనుప వైర్లపై బట్టలు ఆరేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అన్యోన్యంగా జీవించే వీరు ఒక్కసారిగా మృత్యువాత పడడం ఖని వాసులను విషాదంలోకి నెట్టివేసింది. గోదావరిఖని ఏసీపీ రక్షిత కె.మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. గోదావరిఖని వన్‌టౌన్‌ రెండవ సీఐ మహేందర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టమ్‌ నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement