Sakshi News home page

బ్లాక్‌ మార్కెట్‌లోకి యాంటీ వైరల్‌ డ్రగ్స్‌!

Published Sat, Jul 18 2020 9:32 AM

COVID 19 Drugs in Black market Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ బారినపడిన రోగుల చికిత్సకు ఉపకరించే యాంటీ వైరల్‌ ఔషధాలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. అన్నదమ్ములైన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి రెమిడెసివీర్‌ ఇంజెక్షన్లు, ఫాబి ఫ్లూ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. కరోనా వైరస్‌ విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి నగర శివార్లలో తయారయ్యే రెమిడెసివీర్, అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఫాబి ఫ్లూ వంటి యాంటీ వైరల్‌ ఔషధాలకు భారీగా డిమాండ్‌ వచ్చింది. కోవిడ్‌ రోగుల చికిత్సలో వీటిని వినియోగిస్తుండటంతో గతంలో ఎన్నడూలేని విధంగా వీటి ప్రాధాన్యం పెరిగింది.

రెమిడెసివీర్‌ డ్రగ్‌ సంగారెడ్డిలో ఉన్న హెటిరో సంస్థలో తయారవుతోంది. ఈ అత్యవసర యాంటీ వైరల్‌ మందుల్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి, ఈ విపత్కర పరిస్థితుల్ని క్యాష్‌ చేసుకోవడానికి మందుల దుకాణాలు నిర్వహించే అన్నదమ్ములు రంగంలోకి దిగారు. చిలకలగూడలో సోను మెడికల్‌ దుకాణం నిర్వహిస్తున్న సునీల్‌ అగర్వాల్, రామ్‌గోపాల్‌పేటలో సోను ఫార్మసీ నిర్వహించే సోను అగర్వాల్‌లు తమ షాపుల పేరుతో డిస్టిబ్యూటర్ల నుంచి రెమిడెసివీర్‌ ఇంజెక్షన్లు, ఫాబి ఫ్లూ ట్యాబ్లెట్లు ఖరీదు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఔషధాలను నేరుగా ఆసుపత్రులకే విక్రయించాల్సి ఉన్నా...  తమ వద్ద దాచుకొని కోవిడ్‌ రోగులకు రెమిడెసివీర్‌ ఇంజెక్షన్‌ను రూ.35 వేలు, ఫాబి ఫ్లూ ట్యాబ్లెట్స్‌ను రూ.6 వేలకు అమ్ముతున్నారు. ఈ వ్యవహారంపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావుకు సమాచారం అందడంతో శుక్రవారం తమ బృందాలతో దాడి చేశారు. ఇద్దరినీ పట్టుకుని రూ.5.6 లక్షల విలువైన యాంటీ వైరల్‌ ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసులను స్థానిక పోలీసులకు అప్పగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement