మచ్చుకైనా కానరాడు..మానవత్వం ఉన్న వాడు! | Sakshi
Sakshi News home page

మచ్చుకైనా కానరాడు..మానవత్వం ఉన్న వాడు!

Published Mon, Jul 9 2018 1:00 PM

Crime rate Hikes In Prakasam - Sakshi

దర్శి ప్రాంతంలో వరుస హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన 31 రోజుల్లో నాలుగు హత్యలు జరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ నేర సంస్కృతి పెరుగుతోంది. ప్రధానంగా వివాహేతర సంబంధాలు, ఆస్తి, ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలు హత్యలకు దారితీస్తున్నాయి. సంపద కోసం ఐన వాళ్లు, అన్నదమ్ములన్న వివక్ష మరిచి రక్త సంబంధీకులను సైతం చంపేందుకు వెనుకాడటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారి మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి.

తాళ్లూరు: మనిషి అవసరాన్ని అసరా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేయడమేగాక గ్యారంటీకి ఆస్తిని సైతం ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం కూడా వివాదాలకు కారణమవుతోంది. ప్రేమ, అప్యాయత ఉండాల్సిన చోట కక్షలు, కార్పణ్యాలు పెరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలతో భర్త, అన్నలను హత్య చేయించిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తాళ్లూరు మండలం లక్కవరంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ఆయన సొంత చెల్లి తిరుపతమ్మ అడ్డుతొలగించుకునేందుకు పథకం పన్నింది. ఈ క్రమంలో ప్రియుడితో చేతులు కలిపి సొంత అన్నను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్థారించారు.

ఒకటా..రెండా?
ఈ ఏడాది మేలో దర్శి మండలం లంకోజనపల్లికి చెందిన మన్నం రామాంజనేయులును సొంత సోదరుడు కిరాయి హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
జూన్‌ 14న దర్శి పట్టణానికి చెందిన చెందిన ఖాళింవలిని భార్య ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
24న దర్శి మండలం లంకోజనపల్లికి చెందిన సత్తారు బ్రహ్మారెడ్డి హత్యకు గురై సరుగు తోటలో శవమై తేలాడు. పదేళ్లుగా పరిశీలిస్తే సొంత బంధువుల మధ్య ఆస్తి వివాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు.
ముండ్లమూరు మండలం పెద ఉల్లగల్లులో పదేళ్లలో ఆస్తి కోసం ఎనిమిది హత్యలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మృతుల్లో అన్నదమ్ముళ్లు,  మామాఅల్లుళ్లు, తండ్రీకొడుకులు ఉన్నారు. కెల్లంపల్లి పంచాయతీ జగత్‌ నగర్‌లో భూ వివాదంతో రెండు హత్యలు జరిగాయి.
వేంపాడు వద్ద తండ్రీకొడుకుల మీద దాడి జరిగింది. కొడుకు మృతి చెందగా తండ్రి పరారై ప్రాణాలు దక్కించుకున్నాడు.
మూడేళ్లలో దర్శి సర్కిల్‌ పరధిలో 31 హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
2017 ఫిబ్రవరిలో ముండ్లమూరు మండలం మారెళ్లలో వివాహేతర సంబంధం అనుమానంతో కె.ఏసుపాదాన్ని హత్య చేశారు.
2017 మే నెలలో దర్శి మండలం పొతవరానికి చెందిన సాల్మన్‌పై వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో తొలుత మద్యంలో యూరియా కలిపి తాగించి కిరాయి హంతకులతో హత్య చేయించారు.
ముండ్లమూరు మండలం మారెళ్లలో ఆస్తి వివాదంతో కుటుంబ సభ్యులు చిరుమామిళ్ల వెంకటేశ్వర్లును హత్య చేయించారు.
కురిచేడు మండలం పేరంబొట్లపాలెంలో 2016లో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో కుమారుడిని తల్లి హత్య చేయించినట్లు కేసు నమోదైంది.
దొనకొండ మండలం బాదాపురంలో 2017లో వివాహేతర సంబంధానికి భార్య కిరాయి హంతకులతో భర్త సుబ్బారెడ్డిని హత్య చేయించినట్లు కేసు నమోదైంది.
బట్టిపాడు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని అనుమానంతో భర్త గొడ్డలితో నరికి చంపినట్లు కేసు నమోదైంది. ఇలా వివిధ కారణాలతో నేర సంస్కృతి పెరుగుతూ వస్తోంది.

కొత్త పుంతలు తొక్కుతున్న వడ్డీ వ్వాపారం
గతంలో అప్పు అవసరమైతే ప్రామిసరీ నోటు రాయించుకుని రూపాయి లేదా రెండు రూపాయలు చొప్పున వడ్డీతో అవసరానికి అప్పు ఇచ్చి మళ్లీ అవసరాలు తీర్చుకుని ఇస్తుండేవారు. కాల క్రమంలో ఫైనాన్స్‌లు, రోజు వారి వడ్డీ వ్వాపారులు వచ్చారు. నూటిని రెండు, మూడు, ఐదు, పది, అవసరాన్ని బట్టి 40 రూపాయల వరకు వడ్డీ వ్వాపారం పెరిగింది. దానికి తోడు నగదుతో పాటు గ్యారంటీ కోసం పొలం, స్థలల ఏదైనా సరే తాకట్టు లేదా పొలం రిజిస్ట్రేషన్‌లు చేయించుకోవడం మొదలు పెట్టారు. అధిక వడ్డీలు భారీగా పెరిగిపోయి అసలు వడ్డీలు ఇవ్వలేక పోవడం, తీవ్ర ఒత్తిడికి గురై ఇక లాభం లేదనుకున్న సమయంలో ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు. దర్శి మండలం లంకోజనపల్లికి చెందిన రామాంజనేయులు హత్య ఉదంతం కూడా ఈ కోవకు చెందినదే. పలువురు అధిక వడ్డీ భారిన పడి కుటుంబాలతో సహా పట్టణం విడిచి వెళ్లినట్లు సమాచారం. కొందరు తమ ఆస్తులను వడ్డీ వ్వాపారులకు అప్పగించి వెళ్లిపోతున్నారు. మరి కొందరు రాజకీయంగా స్థానికంగా గుర్తింపు కలిగిన వారు కావడంతో తమకు ఉన్న చర, స్థిరాస్తులను వడ్డీ వ్వాపారులకు అప్పగిస్తున్నారు. 

పెరుగుతున్న కిరాయి హత్యలు
అధిక వడ్డీల నుంచి తప్పించుకొనేందుకు లేదా వసూలు చేసుకునేందుకు కిరాయి హంతకులను ఉపయోగించుకోవటం జిల్లాలో చర్చాంశనీయమైంది. ముండ్లమూరు మండలం వేముల వద్ద,  పొదిలిలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం, దర్శి రామాంజేయులు హత్య ఉదంతాలను పరిశీలిస్తే కిరాయి హంతకులు ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ హత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement
Advertisement