ప్రియుడితో కలసి తండ్రిని మట్టుబెట్టింది | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలసి తండ్రిని మట్టుబెట్టింది

Published Thu, Jul 12 2018 1:07 PM

Daughter Killed Father With Boyfriend In Krishna - Sakshi

చల్లపల్లి(అవనిగడ్డ): వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని ప్రియుడితో కలిసి ఏకంగా కన్నతండ్రినే మట్టుపెట్టిన దారుణాన్ని పోలీసులు బయటపెట్టారు. నూజివీడులో హత్య చేసి వంద కిలోమీటర్లు దూరం తీసుకొచ్చి నిమ్మగడ్డ వద్ద మృతదేహాన్ని పడేసి ప్రమాదంగా సృష్టించాలని చేసిన ప్రయత్నాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్టించింది. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌కు నిందితులు అడ్డంగా దొరికిపోయారు. బుధవారం అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన లింగమనేని శేషుకుమారి భర్త 2011లో చనిపోయారు. కుమారుడి చదువు కోసం నాలుగేళ్లుగా ఆమె నూజివీడులోని తుమ్మలవారి వీధిలో అద్దె ఇంట్లో ఉంటోంది.

అదే గ్రామానికి చెందిన గ్యాస్‌ స్టౌవ్‌ మెకానిక్‌ వేముల వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శేషుకుమారి తండ్రి కాజా కృష్ణప్రసాద్‌ కుమార్తె వద్దే ఉంటూ నూజివీడులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. వివాహేతర సంబంధం విషయంలో కుమార్తెను హెచ్చరించాడు. తండ్రి పదేపదే అడ్డు తగులుతున్నాడని భావించిన శేషుకుమారి ఆయన అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. జూన్‌ 30వ తేదీ రాత్రి పది గంటల సమయంలో ప్రియుడు వెంకటేశ్వరరావుతో కలసి ఇంటిలో ఉండగా, కృష్ణప్రసాద్‌ బయట నుంచి గమనించి  కేకలు వేశాడు. దీంతో ఇద్దరూ కలసి కృష్ణప్రసాద్‌ను నోరునొక్కి ఊపిరి ఆడకుండా చేశారు. అనంతరం వెంకటేశ్వరరావు ఇనుపరాడ్డుతో తలపై కొట్టి చంపారు. అనంతరం ఉదయాన్నే శవాన్ని కారు డిక్కీలో వేసుకుని ఆగిరిపల్లి, కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు మీదుగా వెలువోలు దాటి పురిటిగడ్డ సమీపంలో నిమ్మగడ్డ రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

పింఛన్‌కు వెళ్లి చనిపోయాడని నమ్మించి..
గుర్తు తెలియని మృతదేహంగా లభ్యమైన కృష్ణప్రసాద్‌ కేసు ఛేదించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఆయుధంగా నిలిచింది. పత్రికల్లో వార్తలు చూసి తండ్రిని గుర్తు పట్టామంటూ చల్లపల్లి వచ్చిన కుమార్తె శేషుకుమారి తండ్రి పింఛన్‌ కోసం అంగలూరు వెళ్లి కనిపించలేదని, ఫోన్‌ కూడా తీసుకెళ్లలేదని నమ్మబలికింది. తర్వాత తండ్రి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అవనిగడ్డలోనే ఖననం చేయించి వెళ్లిపోయింది. అయితే ఆమె చెప్పిన విషయాలు, కాల్‌డేటా సమయాల్లో తేడా ఉండడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.

కృష్ణప్రసాద్, శేషుకుమారి కాల్‌డేటాను, నూజివీడు నుంచి చల్లపల్లి వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. కాల్‌డేటా సేకరిస్తున్న సమయంలో ప్రియుడు వెంకటేశ్వరరావుపై అనుమానం కలిగి, అతడి కాల్‌డేటా కూడా సేకరించారు. సీసీ కెమెరా పుటేజీ, కాల్‌డేటా క్రోడీకరించి ఆధారాలు సేకరించటంలో నిపుణుడైన ఘంటసాల పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ కేఎన్‌ శివాజీ కీలక ఆధారాలు సంపాదించాడు.
దీంతో పోలీసులు నిందితులు శేషుకుమారి, వెంకటేశ్వరరావులను బుధవారం ఉదయం అరెస్ట్‌ చేసి అవనిగడ్డ కోర్టుకు తరలించారు. 

Advertisement
Advertisement