మంత్రం చెప్పి.. చైన్‌ మాయం చేశాడు

21 Sep, 2019 11:19 IST|Sakshi
బాధితురాలు పెసల భాగ్యమ్మ

సంగంలో వృద్ధురాలి బంగారు చైన్‌ అపహరణ

పోలీసులకు ఫిర్యాదు   

సాక్షి, సంగం(నెల్లూరు): ఆ వృద్ధురాలు చిన్నపాటి అంగడి పెట్టుకుని తినుబండారాలు విక్రయిస్తోంది. గుర్తుతెలియని యువకుడు ఆమె వద్దకు వెళ్లి వ్యాపారం బాగా జరిగేందుకు మంత్రం వేస్తానని బంగారు చైన్‌ తీసుకున్నాడు. మంత్రం చదివి చైన్‌ మాయం చేశాడు. చైన్‌ అపహరించాడని గుర్తించిన వృద్ధురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మండల కేంద్రమైన సంగంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెసల భాగ్యమ్మ అనే వృద్ధురాలు స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రాంగణం సమీపంలో అంగడి పెట్టుకుని తినుబండారాలు విక్రయిస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆమె వద్దకు గుర్తుతెలియని యువకుడు వెళ్లాడు. దక్షిణ ఇస్తే జరగబోయేది చెబుతానని ఆమెను నమ్మించాడు.

వ్యాపారం బాగా జరగాలంటే మెడలో ఉన్న చైన్‌ తీసి తనకు ఇస్తే మంత్రించి తమలపాకుల్లో పెట్టి పసుపు, కుంకుమ రాసి డబ్బాలో వేస్తానని భాగ్యమ్మతో అన్నాడు. ఆమె నిజమని నమ్మి తన రెండు సవర్ల బంగారు చైన్‌ తీసి ఆ యువకుడికి ఇచ్చింది. అతను తమలపాకులో పెట్టినట్లుగా చూపించి చైన్‌ మాయం చేశాడు. మంత్రాలు చదివి తమలపాకు, పసుపు, కుంకుమ ఓ డబ్బాలో పెట్టి భాగ్యమ్మకు ఇచ్చి పరారయ్యాడు. యువకుడు వెళ్లిన పది నిమిషాలకు భాగ్యమ్మ డబ్బా తెరిచి చూడగా అందులో చైన్‌ కనిపించలేదు. తమలపాకు, పసుపు, కుంకుమ మాత్రమే ఉన్నాయి. దీంతో వెంటనే సంగం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి : రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు