వైద్యుల నిర్లక్ష్యంతో కాలు కోల్పోయిన చిన్నారి | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో కాలు కోల్పోయిన చిన్నారి

Published Mon, Jun 3 2019 4:29 PM

Doctors Negligence Child loses Leg - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఐదు సంవత్సరాల ఓ చిన్నారి కాలును కోల్పోయింది. సకాలంలో చికిత్స చేయకుండా తాత్సారం చేయటంతో చిన్నారి వికలాంగురాలైంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కబోర్డు కాలుపై పడింది. దీంతో చిన్నారిని కుటుంబసభ్యులు హుటాహుటిన సనత్‌ నగరలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చిన్నారికి చికిత్స చేయకుండా అక్కడి వైద్యులు కాలయాపన చేశారు. చివరి నిమిషంలో ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారు.

ఇక చేసేదేమీ లేక తల్లిదండ్రులు చిన్నారిని మరో ఆసుపత్రికి తరలించారు. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అక్కడి వైద్యులు చిన్నారి కాలును తీసేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు కాలు కోల్పోయిందని వారు సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేయకుండా కార్పోరేట్‌ ఆసుపత్రికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

Advertisement
Advertisement