మొక్కుబడి నుంచి మృత్యుఒడికి | Sakshi
Sakshi News home page

మొక్కుబడి నుంచి మృత్యుఒడికి

Published Tue, Apr 24 2018 6:38 AM

Driver Died In Road Accident Guntur - Sakshi

వారంతా మొక్కు తీర్చుకునేందుకు సాగరమాత ఆలయానికి వెళ్లారు. మొక్కుబళ్లు అనంతరం కృష్ణాతీరంలో ఆడిపాడారు. అనంతరం తాము అక్కడ చేసిన సరదాలను గుర్తు తెచ్చుకుంటూ ఆనందంగా ఇంటిబాట పట్టారు. ఇంకాసేపట్లో ఇంటికి చేరుతామనుకున్న సమయంలో లారీ రూపంలో మృత్యువు ఎదురై కుటుంబ పెద్దను వారినుంచి శాశ్వతంగా దూరం చేసింది. అంతేకాక కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ కుటుంబంతో సంబంధం లేని మరో వ్యక్తీ ఈ ఘటనలో బలైపోవడం  విషాదం..

సత్తెనపల్లి: సవ్యంగా సాగిపోతున్న జీవితాల్లో రహదారి ప్రమాదం తీరని విషాదం నింపింది. ఒక డ్రైవర్, ఎలక్ట్రికల్‌ హెల్పర్‌ మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కంతేరుకు చెందిన బురదగుంట జీవరత్నం (60) ఆయన భార్య ఎలీసమ్మ, కాలే సువర్ణ, బురదగుంట సువార్తమ్మ మరో ముగ్గురు కలసి తమ మొక్కు తీర్చుకునేందుకు నాగార్జునసాగర్‌ వెళ్లి వస్తున్నారు. మల్టీ యుటిలిటీ వాహనం(ఎంయూవీ)లో కంతేరు వెళ్తుండగా సత్తెనపల్లి మండలం పెదమక్కెన గ్రామం వద్దకు రాగానే ఎదురుగా గుజరాత్‌ వెళ్ళేందుకు దారపు ఉండలు లోడు కలిగిన లారీ పొన్నెకల్లు నుంచి సత్తెనపల్లి వస్తూ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మల్టీ యుటిలిటీ వాహనం నడుపుతున్న జీవరత్నం (60) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన వెనుక వైపు కూర్చొన్న భార్య ఎలీసమ్మ చెయ్యి విరిగి తీవ్రగాయాలపాలైంది. అంతేగాక సువర్ణ, సువార్తమ్మ, మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. వాహనాలు ఢీకొనడంతో అదే సమయంలో సమీపంలో నీలంపాటి అమ్మవారి దేవాలయానికి లైటింగ్‌ హెల్పర్‌గా పని చేసే పెదకూరపాడుకు చెందిన కొర్లకుంట అంబరీష్‌ (28) ఉండడంతో లారీ తగిలి కాలువలోకి పడ్డాడు. ఒక్కసారిగా అతనిపై లారీ పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని సత్తెనపల్లి రూరల్‌సీఐ ఎమ్‌. వీరయ్య సందర్శించి వివరాలు సేకరించారు. సోమవారం ఏరియా వైద్యశాలలో ఇరువురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement