Sakshi News home page

మత్తు వదిలిస్తున్నారు!

Published Sat, Mar 10 2018 7:35 AM

Drunk And Drive tests In Srisailam ORR - Sakshi

కడ్తాల్‌(కల్వకుర్తి):  సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని కడ్తాల్‌ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైలం– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నిరంతర నిఘాతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కడ్తాల్‌ పోలీస్‌ స్టేసన్‌ పరిధిలో 2017 జనవరి నుంచి డిసెంబర్‌ 31 వరకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేశారు. మండల కేంద్రం మీదుగా జాతీయ రహదారి ఉండడంతో వాహనాలు భారీగా రాకపోకలు సాగిస్తుంటాయి. విహార యాత్రలకు వెళ్లిన వారితో పాటు, మైసిగండి నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌ వెళ్లే వారే అధికంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులలో దొరికిపోతు న్నారు. మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌ సమీపంలో, తలకొండపల్లి చౌరస్తా, టోల్‌గేట్‌ సమీపంలో గత ఏడాది 347 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు.

11  మందికి జైలుశిక్ష..
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో పాటు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి, కోర్టులో హాజరు పరుస్తున్నారు. ఇప్పటి వరకు 11 మందికి జైలు శిక్ష పడింది. అదేవిధంగా పట్టుపబడిన మందుబాబుల నుంచి పెద్ద మొత్తంలో  ఛలాన్లు వసూలు చేశారు. 2017 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు రూ.7,67,500 చలానాల రూపంలో వసూలు చేశారు. అదే విధంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 34 కేసులు నమోదు కావడంతో పాటు, రూ.69 వేల చలాన్లు వసూలు చేశారు. 

ఆదివారం రద్దీ ఎక్కువ..
ప్రత్యేకించి ఆదివారం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించడం పోలీసులకు కష్టంగా మారింది. ఆదివారం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. ఒక్క వాహనాన్ని ఆపి తనిఖీ  చేస్తుండగా భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అదే విధంగా ఆదివారం మైసిగండికి వచ్చి విందు కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు ప్రయాణమవుతున్న వారు ఎక్కువగా పోలీసుల తనికీల్లో దొరికిపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులు, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న  సందర్భాల్లో నానా హంగమా సృష్టిస్తుండటంతో పోలీసులకు కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. సిబ్బంది తక్కువగా ఉండడం.. బ్రీత్‌ ఎనలైజర్‌ ఒక్కటే ఉండడం కూడా పోలీసులకు తనిఖీలకు అడ్డంకిగా మారాయి.

నిత్యం తనిఖీలు చేపడుతున్నాం..
కడ్తాల్‌– మైసిగండి మధ్యలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటడంతో, గత ఏడాదిన్నర కాలంగా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రతి మంగళ, గురువారాలతో పాటు ఆదివారం తప్పనిసరిగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేడుతున్నాం. సమయంతో సంబంధం లేకుండా రెగ్యులర్‌గా చెక్‌చేస్తున్నాం. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.     –సుందరయ్య, ఎస్‌ఐ, కడ్తాల్‌

Advertisement

What’s your opinion

Advertisement