దుబాయ్‌ ట్రిప్పంటూ 67 మందిని.. | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 7 2018 11:13 AM

Dubai Tour Two Man Cheated 67 People At Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో :  తక్కువ రేటుకు దుబాయ్‌ ట్రిప్పు ఏర్పాటు చేస్తామంటూ 67 మందిని రూ.17 లక్షల మేర మోసం చేసిన ఇద్దరు నిందితులను సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఓ సంస్థతో ఒప్పందం ఉన్నప్పటికీ వీరిద్దరూ ఆ సంస్థకు డబ్బు చెల్లించకుండా స్వాహా చేసినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి పేర్కొన్నారు. విశాఖపట్నానికి చెందిన రాజ్‌కుమార్‌ హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాడు. మలేషియాలో మంచి జీతంతో ఉన్న ఉద్యోగాలు దొరుకుతాయనే ఉద్దేశంతో కౌలాలంపూర్‌ వెళ్లిన అతడికి అక్కడ గుంటూరుకు చెందిన శ్యాంకుమార్‌తో పరిచయం ఏర్పడింది. 2016లో తిరిగి వచ్చిన ఇరువురూ ట్రావెల్స్‌ వ్యాపారం చేయాలని భావించారు.

రాజ్‌కుమార్‌ ఢిల్లీలో ఉంటూ బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్‌లకు వెళ్లే టూరిస్ట్‌లు వెతికే వాడు. అందుకు అవసరమైన విమాన టిక్కెట్లను శ్యామ్‌కుమార్‌ ఏర్పాటు చేసే వాడు. ఈ వ్యాపారం లాభసాటిగా లేకపోవడం మోసాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి చెందిన ఓవర్సీస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంస్థతో రాజ్‌కుమార్‌ ఒప్పందం చే సుకుని దాని ఏజెంట్‌గా మారాడు. కొన్ని లావాదేవీల తర్వాత అసలు కథకు శ్రీకారం చుట్టాడు. దుబాయ్‌ టూర్‌ ప్యాకేజ్‌ను రూ.40 వేలుగా ఓవర్సీస్‌ సంస్థ నిర్దేశించింది. అయితే నగరంలోని అశోక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన జె.ప్రతాప్‌రెడ్డి సహా 67 మందికి తాము కేవలం రూ.25 వేలకే సదరు ప్యాకేజ్‌ ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. అడ్వాన్స్‌ చెల్లిస్తే టిక్కెట్లు, వీసా ఏర్పాటు చేస్తామని, ఢిల్లీకి చెందిన ఓవర్సీస్‌ సంస్థతో తమకు ఒప్పందం ఉందని చెప్పారు.

బాధితులు ఆ సంస్థను సంప్రదించగా రాజ్‌కుమార్‌ తమ ఏజెంటే అని చెప్పారు. దీంతో రూ.17 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా శ్యాంకుమార్‌కు బదిలీ చేశారు. ఈ సొమ్మును అతడు రాజ్‌కుమార్‌ వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేశాడు. ప్రయాణ సమయం దగ్గర పడుతున్నా వీసా, టిక్కెట్లు అందకపోవడంతో బాధితులు ఓవర్సీస్‌ ట్రావెల్స్‌ను సంప్రదించగా,   రాజ్‌కుమార్‌ నుంచి తమకు నగదు అందలేదని వారు తెలిపారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రాజ్‌కుమార్‌ ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసుల అతడికి అక్కడ అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఈ విషయం తెలిసిన శ్యాం సీసీఎస్‌ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో అతడినీ అరెస్టు చేశారు.  

ఫ్లాట్ల పేరుతో మోసం కేసులో... 
పద్మారావునగర్‌లో 35 ఫ్లాట్లతో కూడిన అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తూ 60 మంది నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు సునీల్‌ జె.సచ్‌దేవ్‌ను సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సుల్తాన్‌బజార్‌ ప్రాంతంలో ఘరోండా బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ పేరుతో కా ర్యాలయం నిర్వహిస్తున్న సునీల్‌పై 2010 నుంచి ఇప్పటి వరకు నగరంలోని సుల్తాన్‌బజార్, చిక్కడపల్లి, చిలకలగూడ, సీసీఎస్‌ల్లో 25 కేసులు నమోదైనట్లు డీసీపీ అవినాష్‌ మహంతి పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఎస్‌.శ్రీహరి 1581 గజాల ఫ్లాట్‌ కోసం రూ.18.75 లక్షలు చెల్లించి మోసపోయారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం సునీల్‌ను అరెస్టు చేసి మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇతడిపై సీసీఎస్‌లో మొత్తం ఐదు కేసులు నమోదై ఉన్నాయి.     

Advertisement
Advertisement